మోస్ట్‌ వాంటెడ్‌.. బ్రిజేష్‌ గంజూ కథ ముగిసింది! | Former Sarpanch Turned Most Wanted Maoist Leader Brijesh Ganju Killed In UP ATS Encounter, Check Details Inside | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌.. బ్రిజేష్‌ గంజూ కథ ముగిసింది!

Sep 20 2026 11:47 AM | Updated on Sep 20 2026 12:43 PM

TSPC Chief Brijesh Ganjhu Killed in UP ATS Encounter

న్యూఢిల్లీ: బ్రిజేష్‌ గంజూ.. ఒకప్పుడు గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌. ఆ తర్వాత నిషేధిత మావోయిస్టు సంస్థ టీఎస్‌పీసీ (తృతీయ సమ్మేళన్‌ ప్రెజెంటేషన్‌ కమిటీ) అగ్రనేతగా ఎదిగాడు. అనంతరం రూ.30 లక్షల రివార్డు ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా మారి.. చివరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ఏటీఎస్‌ (యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. జార్ఖండ్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా మావోయిస్టులకు సమాంతరంగా టీఎస్‌పీసీ కార్యకలాపాలు సాగించడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు.

2004లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు
బ్రిజేష్‌ సింగ్‌ గంజూ అలియాస్‌ గోపాల్‌ సింగ్‌ భోక్తా, దులార్‌చంద్‌ గంజూ, రంజన్‌, ఫుల్‌చంద్‌ గంజూ తదితర పేర్లతోనూ చలామణి అయ్యాడు. జార్ఖండ్‌లోని చత్రా జిల్లా లావాలౌంగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లుట్టూ సోహావన్‌ గ్రామం అతడి స్వస్థలం. 2004లో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కి వ్యతిరేకంగా సమాంతర సంస్థను ఏర్పాటు చేశాడు. అదే తర్వాత టీఎస్‌పీసీగా విస్తరించింది.

మావోయిస్టులతో సుదీర్ఘ ఆధిపత్య పోరు
చత్రాతోపాటు రాంచీ, హజారీబాగ్‌, రామ్‌గఢ్‌, పలామూ, లాతేహార్‌ జిల్లాలతో పాటు బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో టీఎస్‌పీసీ కార్యకలాపాలు పెరిగాయి. మావోయిస్టులతో ఆధిపత్యం కోసం రెండు దశాబ్దాలపాటు ఘర్షణలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మావోయిస్టులతోపాటు పలువురు గ్రామీణులు, ఇతరులు ప్రాణాలు కోల్పోయారు.

మావోయిస్టు కార్యకలాపాలతోపాటు ‘ముఖియా’
టీఎస్‌పీసీకి నాయకత్వం వహిస్తున్న సమయంలోనే బ్రిజేష్‌ గంజూ రాజకీయంగానూ గ్రామస్థాయిలో గుర్తింపు పొందాడు. 2010లో లావాలౌంగ్‌ పంచాయతీకి ఏకగ్రీవంగా ముఖియాగా ఎన్నికయ్యాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి పేరు మావోయిస్టుల జాబితాలో చేరింది. భద్రతా బలగాల నిఘా పెరగడంతో చాలాకాలంగా పరారీలో ఉన్నాడు.

రూ.30 లక్షల రివార్డు
బ్రిజేష్‌ గంజూపై జార్ఖండ్‌ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో రూ.5 లక్షల రివార్డు పెట్టింది. దీంతో అతడిపై మొత్తం రూ.30 లక్షల రివార్డు ఉంది.

రామనగర్‌లో ఎన్‌కౌంటర్‌
బనారస్‌లోని రామనగర్‌ ప్రాంతంలోని టెంగ్రా మోడ్‌ లంకా మైదానంలో ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు తెలిపారు. బైక్‌పై బ్రిజేష్‌ గంజూ వెళ్తున్న సమాచారంతో యూపీ ఏటీఎస్‌ అక్కడ మోహరించింది. ఉదయం సుమారు 5 గంటలకు అతడిని అడ్డుకోగా, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిగా ఏటీఎస్‌ జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఏటీఎస్‌ డీఎస్పీ విపిన్‌ రాయ్‌, హవల్దార్‌ నితేంద్ర కృష్ణ బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లకు కూడా తూటాలు తగిలాయి. ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయపడ్డారు.

ఇదీ చదవండి: నేపాల్‌ వరదలు.. 40 పిరమిడ్లు కట్టేంత శిథిలాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement