రియాసీ: జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లా, త్రికూట పర్వతాలపై కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి బేస్ క్యాంప్ కత్రాలోని హెలిపాడ్ టెర్మినల్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టెర్మినల్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో టెర్మినల్ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ సిబ్బంది, భద్రతా బలగాలు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో టికెట్ కౌంటర్‌లోని కొన్ని కంప్యూటర్లతో పాటు సమీపంలోని ఓ కాఫీ షాప్ అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వైష్ణోదేవి రవాణా కేంద్రంలో జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: మోదీ జన్మదిన వేడుకలకు డుమ్మా.. విద్యార్థులకు నోటీసులు


