‘మరో రోహిత్‌ వేముల..’ దళిత పీహెచ్‌డీ విద్యార్థి ఆవేదన | Dalit PhD Scholar Alleges Scholarship Delay Tamil Nadu Government Denies Charges | Sakshi
Sakshi News home page

‘మరో రోహిత్‌ వేముల..’ దళిత పీహెచ్‌డీ విద్యార్థి ఆవేదన

Sep 19 2026 1:29 PM | Updated on Sep 19 2026 1:35 PM

Dalit PhD Scholar Alleges Scholarship Delay Tamil Nadu Government Denies Charges

కౌలాలంపూర్‌: మలేషియాలో పీహెచ్‌డీ చేస్తున్న తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థి స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా తన పరిశోధన ఆరు నెలలుగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ ఫీజులు చెల్లించకపోవడంతో తన చదువు ఆగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మరో రోహిత్‌ వేములా చూస్తున్నారని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే స్కాలర్‌షిప్‌లో భాగంగా ఇప్పటికే నిధులు విడుదల చేశామని, మిగిలిన పరిశోధన నిధులకు అవసరమైన పత్రాలు, విశ్వవిద్యాలయ సిఫారసు అందాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మదురైకి చెందిన భరతిదాసన్‌ రామన్‌ మలేషియాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియాలో టిష్యూ ఇంజినీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నల్ అంబేడ్కర్ ఓవర్సీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ ద్వారా ఆయనకు ఆర్థిక సహాయం అందుతోంది. గురువారం విడుదల చేసిన వీడియోలో స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో జాప్యం వల్ల తన పరిశోధనకు ఆటంకం కలుగుతోందని రామన్‌ ఆరోపించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, లేదంటే ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పాలని, అప్పుడు తాను ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటానని తెలిపారు.

తన రెండో ఏడాది పరిశోధన కోసం రూ.19.50 లక్షలు అవసరమని రామన్‌ కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే పరిశోధనకు సంబంధించిన ఖర్చుల అంచనాలు, బిల్లులకు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సిఫారసు లేదని సామాజిక న్యాయశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 17న యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఈమెయిల్‌ పంపి, పరిశోధనకు అవసరమైన సామగ్రి, ఖర్చులపై ధ్రువీకరణ కోరినట్లు తెలిపింది. ఆ ఇమెయిల్‌ ప్రతిని విద్యార్థికి కూడా పంపినట్లు వెల్లడించింది.

సామాజిక న్యాయశాఖ వివరణ
రామన్‌కు తొలి విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం నిధులను విడుదల చేసినట్లు తమిళనాడు సామాజిక న్యాయశాఖ తెలిపింది. ట్యూషన్ ఫీజు, వీసా, విమాన ప్రయాణం, జీవన వ్యయం, పరిశోధన ఖర్చులు ఇందులో ఉన్నాయని పేర్కొంది. పరిశోధన, జీవన వ్యయాలకు సంబంధించిన ఖర్చులకు బిల్లులు, వోచర్లు సమర్పించాల్సి ఉందని తెలిపింది. కొన్ని పరిశోధన సామగ్రికి సంబంధించిన బిల్లులు, చెల్లింపు ఆధారాలు సకాలంలో సమర్పించలేదని, కొన్నింటిని ఆగస్టు 20న సమర్పించారని వివరించింది. రెండో ఏడాదికి రూ.12 లక్షలు, అందులో యూనివర్సిటీ ఫీజుగా రూ.5.57 లక్షలు, జీవన వ్యయాల కోసం రూ.6.65 లక్షలు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా తొలి రెండు సంవత్సరాలకు రూ.48 లక్షలు అందించినట్లు పేర్కొంది.

ప్రభుత్వ వాదనను ఖండించిన రామన్‌
ప్రభుత్వ వాదనను రామన్‌ ఖండించారు. ప్రభుత్వం ప్రస్తావిస్తున్న రూ.36 లక్షలు తనకు ఇప్పటికే అందిన మొదటి ఏడాది కేటాయింపేనని, తాను కోరుతున్నది రెండో ఏడాది పరిశోధనకు సంబంధించిన అదనపు నిధులని ఆయన చెబుతున్నారు. రెండో ఏడాది పరిశోధన నిధులు విడుదల కాకపోవడంతో తన పని నిలిచిపోయిందని, అక్టోబర్‌ ప్రారంభంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరిశోధనా పత్రాన్ని సమర్పించే అవకాశం కూడా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అవసరమైన పత్రాలు సక్రమంగా సమర్పించి, విశ్వవిద్యాలయ సిఫారసు వచ్చిన తర్వాతే అదనపు పరిశోధన సహాయం అందించగలమని స్పష్టం చేసింది.

డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ.. విద్యార్థి సహాయం అడగడం లేదని, ప్రభుత్వం హామీ ఇచ్చిన హక్కును కోరుతున్నారని అన్నారు. ప్రభుత్వం మారిన కారణంగా విద్యార్థి బహుళ సంవత్సరాల ఉన్నత విద్యా లక్ష్యం దెబ్బతినకూడదని పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా స్కాలర్‌షిప్‌ అందించడంలో విద్యార్థికి ఇన్ని ఇబ్బందులు ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం యూనివర్సిటీ అధికారిక సిఫారసు, ఖర్చులకు సంబంధించిన పత్రాల పరిశీలన పూర్తయ్యే వరకు ఈ వ్యవహారం  ఒక కొలిక్కి వచ్చేలా లేదు.

స్కాలర్‌షిప్‌ పథకం ఏమిటి?
తమిళనాడు సామాజిక న్యాయశాఖ అమలు చేస్తున్న అన్నల్ అంబేడ్కర్ ఓవర్సీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ ఆదిద్రావిడ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య, పరిశోధనలు చేసేందుకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ట్యూషన్ ఫీజులు, వీసా, విమాన ప్రయాణం, జీవన వ్యయం, పరిశోధన ఖర్చులకు గరిష్ఠంగా ఏడాదికి రూ.36 లక్షల వరకు, గరిష్ఠంగా మూడు సంవత్సరాల పాటు సహాయం అందుతుంది. 2023-24లో 35 మంది విద్యార్థులకు రూ.8.94 కోట్లు, 2024-25లో 163 మందికి రూ.60.33 కోట్లు, 2025-26లో 181 మందికి రూ.84.87 కోట్లు అందించినట్లు శాఖ వెల్లడించింది. 2026-27లో 365 మంది విద్యార్థులకు రూ.131 కోట్ల సహాయానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది.

రోహిత్‌ వేములకు జరిగిన అ‍న్యాయం ఏమిటి?
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ చక్రవర్తి వేముల 2016 జనవరి 17న న్యూ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ హాస్టల్‌ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దళిత హక్కుల కోసం  పోరాడిన అతనిని వేధించి ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలు వచ్చాయి. 2025 జూలై నుంచి యూనివర్సిటీ ప్రతినెలా అతనికి అందించాల్సిన రూ. 25,000 ఫెలోషిప్‌ను నిలిపివేసింది. దీంతో అతను అంబేద్కర స్టూడెంట్‌ అసోసియేన్‌(ఏఎస్‌ఏ) ఏర్పాటుచేసి, దళితుల హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. 

ఇదీ చదవండి: పారిస్‌ ఒప్పందాన్ని నిలబెట్టాం : ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement