జన్వాడ ఫామ్ హౌస్‌కు కాంగ్రెస్ నేతలు అప్‌డేట్స్..
- జన్వాడ ఫామ్‌హౌస్ దగ్గర పోలీసుల మోహరింపు..
- ఫామ్‌హౌస్ వద్దకు చేరుకున్న చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్
👉తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య భూ వివాదం మరింత ముదురుతోంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం వరుసగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడుతోంది. శుక్రవారం సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. శనివారం జన్వాడలో కేటీఆర్, ఆయన కుటుంబానికి సంబంధించిన భూముల అంశాన్ని పరిశీలించనున్నారు.
👉కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉదయం 10.30 గంటలకు ప్రజాభవన్ నుంచి బయలుదేరి జన్వాడకు వెళ్లనున్నారు. అక్కడ భూములకు సంబంధించిన రికార్డులు, యాజమాన్య వివరాలు, ప్రభుత్వ భూములతో సంబంధం ఉన్న అంశాలను పరిశీలించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలు అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా వెలికట్టలో హరీశ్‌రావు బంధువు హనుమంతరావుకు సంబంధించిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను కాంగ్రెస్ బృందం పరిశీలించింది. భూముల రికార్డులు, పహాణీలు, పట్టాదారు వివరాలతో పాటు బదలాయింపు, రిజిస్ట్రేషన్ నిబంధనలపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించింది.
👉జన్వాడ అంశంలో మాత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. జన్వాడ ఫార్మ్‌హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ.. ఆస్తి తనదేనని, కేటీఆర్‌కు ఎలాంటి యాజమాన్య హక్కు లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడని, ఫార్మ్‌హౌస్‌ను ఆయనకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయని, అధికారికంగా అడిగితే అందజేస్తానని చెప్పారు.
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే..!
కేటీఆర్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు.
- ప్రదీప్ రెడ్డి pic.twitter.com/BOKLm1kNh9— Rebel Freak (@rebelfreak0298) September 18, 2026
👉మరోవైపు కేటీఆర్ ఈ ఆరోపణలపై న్యాయ విచారణకు సవాల్ విసిరారు. తన కుటుంబంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల సవాళ్లు, ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో భూముల అంశం ఇప్పుడు ప్రధాన రాజకీయ వివాదంగా మారింది. ఇదే క్రమంలో శంషాబాద్‌లో జగదీశ్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన భూములనూ కాంగ్రెస్ ప్రతినిధులు పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతల భూములపై కాంగ్రెస్ చేపడుతున్న వరుస పర్యటనలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: దానం నాగేందర్ దారెటు?


