ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 9న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు రిటరి్నంగ్ అధికారిగా ఉన్న హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దాదాపు 38 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్న ఈ ఎన్నికలు సంస్థలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సెప్టెంబర్ 21న ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. పోటీ చేసే యూనియన్లు తమ సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 22న ప్రాథమిక ఓటర్ల జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది.
సెప్టెంబర్ 25న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.
సెప్టెంబర్ 26న పోటీలో నిలిచే కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.
అక్టోబర్ 9న ఉదయం నుంచి సాయంత్రం వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది.
అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజున అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.
ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు...
ఆర్టీసీ నిబంధనల ప్రకారం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలి. కానీ, సంస్థలో చివరిసారిగా 2016 జూలై 19న ఎన్నికలు జరగ్గా, అందులో తెలంగాణ మజ్దూర్ యూనియన్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత 2020లో జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించలేదు.
2019లో 53 రోజుల రికార్డు సమ్మె జరిగినప్పుడు నాటి ప్రభుత్వం సంస్థలో యూనియన్లను అనధికారికంగా నిషేధించింది. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు నిలిచిపోయాయి. అసలు యూనియన్ల మనుగడే లేని తరుణంలో, ఇటీవల మరోసారి సమ్మె చేసిన సంఘాలు పట్టుపట్టి యూనియన్లకు తిరిగి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్రధాన డిమాండ్‌గా మంత్రులతో చర్చలు జరిగినప్పుడు విలీనానికి మంత్రులు అంగీకరించారు.
తమకు ప్రభుత్వంలో విలీనమే కావాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు అవసరం లేదన్న కార్మికుల వాదనను వినిపిస్తూ యూనియన్ల నేతలు చర్చలు జరిపారు. కానీ, తర్వాత ప్రభుత్వం ఉన్నట్టుండి గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని, అందులో విజయం సాధించిన యూనియన్ ప్రాతినిధ్యంతో ఉండే అధికారుల కమిటీ విలీనం అంశంపై అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. చివరకు విలీనం అంశానికంటే ముందే ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
ఇదీ చదవండి: రోజుకో నాయకుడి అక్రమాలు బయటపెడతాం!


