breaking news
TSRTC Union elections
-
వచ్చే నెల 9న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 9న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు రిటరి్నంగ్ అధికారిగా ఉన్న హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దాదాపు 38 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్న ఈ ఎన్నికలు సంస్థలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.సెప్టెంబర్ 21న ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. పోటీ చేసే యూనియన్లు తమ సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది.సెప్టెంబర్ 22న ప్రాథమిక ఓటర్ల జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది.సెప్టెంబర్ 25న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.సెప్టెంబర్ 26న పోటీలో నిలిచే కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.అక్టోబర్ 9న ఉదయం నుంచి సాయంత్రం వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది.అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజున అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు... ఆర్టీసీ నిబంధనల ప్రకారం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలి. కానీ, సంస్థలో చివరిసారిగా 2016 జూలై 19న ఎన్నికలు జరగ్గా, అందులో తెలంగాణ మజ్దూర్ యూనియన్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత 2020లో జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించలేదు.2019లో 53 రోజుల రికార్డు సమ్మె జరిగినప్పుడు నాటి ప్రభుత్వం సంస్థలో యూనియన్లను అనధికారికంగా నిషేధించింది. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు నిలిచిపోయాయి. అసలు యూనియన్ల మనుగడే లేని తరుణంలో, ఇటీవల మరోసారి సమ్మె చేసిన సంఘాలు పట్టుపట్టి యూనియన్లకు తిరిగి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్రధాన డిమాండ్‌గా మంత్రులతో చర్చలు జరిగినప్పుడు విలీనానికి మంత్రులు అంగీకరించారు.తమకు ప్రభుత్వంలో విలీనమే కావాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు అవసరం లేదన్న కార్మికుల వాదనను వినిపిస్తూ యూనియన్ల నేతలు చర్చలు జరిపారు. కానీ, తర్వాత ప్రభుత్వం ఉన్నట్టుండి గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని, అందులో విజయం సాధించిన యూనియన్ ప్రాతినిధ్యంతో ఉండే అధికారుల కమిటీ విలీనం అంశంపై అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. చివరకు విలీనం అంశానికంటే ముందే ఎన్నికల ప్రక్రియ మొదలైంది.ఇదీ చదవండి: రోజుకో నాయకుడి అక్రమాలు బయటపెడతాం! -
ఆర్టీసీలో అప్పుడే ఎన్నికల వే‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న గుర్తింపు యూనియన్ పదవీకాలం ఈనెల 7వ తేదీతో ముగిసింది. దీంతో తిరిగి ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయిన దరిమిలా ఇక్కడా అదే వాతావరణం నెలకొంది. దీంతో కొందరు యూనియన్ నేతలు అపుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. మంగళవారం అన్ని యూనియన్లు మోటారు వాహన సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నాయి. సాయంత్రానికి సమ్మె ముగియగానే పలు యూనియన్ల నేతలు ఎన్నికలపై దృష్టిసారించారు. కీలక నిర్ణయాల్లో..! ఆర్టీసీలో ప్రతీ రెండేళ్లకోసారి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్ గుర్తింపు యూనియన్‌గా రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఆర్టీసీ తీసుకునే పలు కీలక నిర్ణయాలు, చర్చలు, వివిధ కార్యక్రమాల్లో ఈ యూనియన్ సభ్యులకు అధికారికంగా ఆహ్వానం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల సమస్యలు, ఇబ్బందులను నేరుగా సంస్థ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యూనియన్‌కు దక్కుతుంది. పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించే వరకు ఈ యూనియనే ఆపద్ధర్మ గుర్తింపు యూనియన్‌గా కొనసాగుతుంది. 2013 నుంచి టీఎంయూనే..! ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ 2013 నుంచి ఆర్టీసీలో తన హవా కొనసాగిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పురుడుపోసుకున్న టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కలసి 2012 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2013 జనవరి 3న అధికారిక యూనియన్‌గా ఉత్తర్వులు వచ్చాయి. 2015 జనవరి 2తో వీరి పదవీకాలం ముగిసింది. తరువాత 2016 జూలైలో మరో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. మొత్తానికి ఐదున్నరేళ్లుగా టీఎంయూ అధికారిక యూనియన్‌గా ఉండటం విశేషం. గతానుభవాల దృష్ట్యా ఈ మారు ఎన్నికలు సకాలంలో జరుగుతాయా..లేదా వాయిదా పడుతాయా అనే చర్చకూడా కార్మికుల్లో సాగుతోంది. ఎందుకైనా మంచిదని కొన్ని సంఘాలు అప్పుడే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రచారం ముందస్తుగానే ప్రారంభించేశాయి. ఎన్నికలు వాయిదా వేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. -
'నా పై ఆరోపణలకు ఈ ఎన్నికలే రిఫరెండం'
- టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్దామరెడ్డి హైదరాబాద్ : నాపై వచ్చిన ఆరోపణలకు ఈ ఎన్నికలే రిఫరెండమని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అశ్వత్ధామరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మెరుగైన పే స్కేల్ టీఎంయూతోనే సాధ్యమని ఆయన అన్నారు. గతంలో తాము కార్మికులకు చేసిన మంచి పనులే తమ గెలుపునకు సోపానాలు అవుతాయని ఆయన తెలిపారు. ఈ దఫా ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమని అశ్వత్థామరెడ్డి జోస్యం చెప్పారు.


