ఎల్‌నినోపై సమగ్ర వ్యూహం | El-Nino Effect Centre Supports Low Water Crops Farmers | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోపై సమగ్ర వ్యూహం

Sep 19 2026 7:50 AM | Updated on Sep 19 2026 8:00 AM

El-Nino Effect Centre Supports Low Water Crops Farmers

వ్యవసయ సదస్సులో అభివాదం చేస్తున్నశివరాజ్‌సింగ్‌ చౌహాన్, రామ్‌నాథ్‌ ఠాకూర్, భగీరథ్‌ చౌదరి, తుమ్మల, అచ్చెన్నాయుడు తదితరులు

రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రూపకల్పన

జిల్లా ఆధారిత అత్యవసర ప్రణాళికలు సిద్ధం

తక్కువ నీటితో పండే పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం

కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడి

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌ నినో వల్ల తలెత్తిన నీటి ఎద్దడిని అధిగమించడానికి తక్కువ నీటి వినియోగంతో పండే పంటల సాగును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఇందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణాదిన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఎల్‌ నినో ప్రభావం ఒకటని అన్నారు. ఈ ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో చౌహాన్‌ మాట్లాడారు.

ఎల్‌ నినో ప్రభావం దక్షిణాదిపైనే అధికం 
ఎల్‌ నినో ప్రభావం ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదు. ఒక్కో జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉన్నందున, చాలా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను గుర్తించి, వాటి కోసం ప్రత్యేకంగా జిల్లా ఆధారిత అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేశాం. రబీ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, ఎల్‌ నినో వల్ల మారే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సాంకేతిక, ఆర్థిక సహాయసహకారాలు అందిస్తుంది. కేంద్ర–రాష్ట్రాలు కలిసికట్టుగా రైతులకు సానుకూల ఫలితాలు అందించాలి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎల్‌ నినో వాతావరణ మార్పుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంది. ఇక్కడి జిల్లాల్లో ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో సాగు నీటి కొరత ఏర్పడింది.

రైతు అన్నదాతే కాదు.. జీవనదాత
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, కృత్రిమ మేధస్సు, యంత్ర పరిజ్ఞానం ప్రపంచాన్ని ఎంతగా శాసించినప్పటి కీ వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. యంత్రాలు రొట్టెలను తయారు చే యగలవు కానీ, పొలంలో గోధుమలను పండించలేవు. మానవ మనుగడకు అవసరమైన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు కేవ లం పొలాల నుంచే వస్తాయి. వాటిని పండించే రైతు కేవలం ’అన్నదాత’ మాత్రమే కాకుండా ఈ సమాజానికి ’జీవనదాత’.

రైతుల జీవితాల్లో మార్పే లక్ష్యం 
ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా, దేశ మే ప్రథమం అనే నినాదంతో కేంద్ర ప్రభు త్వం పనిచేస్తుంది. రైతుల జీవితాల్లో సాను కూల మార్పులు తీసుకురావడమే మా లక్ష్యం. దేశంలోని 140 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడం మామొదటి లక్ష్యం. ఆహార అవసరా ల కోసం భారత్‌ ఏ ఇతర దేశంపై ఆధారపడకూడదు. దేశానికి అన్నం పెట్టే రైతు సురక్షిత, సంపన్న జీవితాన్ని గడపాలి. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ముఖ్య ప్రా ధాన్యత. ప్రజలకు కేవలం ఆహారం అందించడమే కాకుండా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం.

పాత కొబ్బరి తోటల స్థానంలో.. 
సంవత్సర కాలంలో భారతదేశ కొబ్బరి ఎగుమతులు రూ.4,349 కోట్ల నుండి రూ.7,038 కోట్లకు చేరాయి. అంటే ఏకంగా 62 శాతం వృద్ధి నమోదు అయ్యింది. తాజాగా కొబ్బరి సాగును ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో సరికొత్త పథకాన్ని ప్రకటించాం. అది త్వరలోనే అమలులోకి రానుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలే అగ్రగామిగా ఉన్నందున, ఈ కొత్త పథకం పూర్తి ప్రయోజనాలను రైతులు పొందేలా రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. 60–70 సంవత్సరాల నాటి పాత కొబ్బరి తోటల స్థానంలో విడతల వారీగా కొత్త మొక్కలను నాటేలా పునరుజ్జీవన వ్యూహాన్ని రూపొందించాలి. చట్టాలు, నిబంధనలు ప్రజల కోసమే ఏర్పడ్డాయి కానీ, చట్టాల కోసం ప్రజలు లేరు. కాలం చెల్లిన పాత చట్టాలను, సంక్లిష్ట విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలి..’అని కేంద్రమంత్రి సూచించారు. సదస్సులో కేంద్ర సహాయ మంత్రులు రామ్‌నాథ్‌ ఠాకూర్, భగీరథ్‌ చౌదరి, దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు.  

ఎల్‌ నినో సహాయ నిధి ఏర్పాటు చేయండి: మంత్రి తుమ్మల
ఎల్‌ నినో, అనిశ్చిత వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌ నినో సహాయ నిధి ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. సూక్ష్మ సేద్యం, నీటి పొదుపు చర్యలకు మరింత సహాయం అందించాలని విన్నవించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తుచేశారు. ఆయిల్‌పామ్‌ రైతులకు ధర భద్రత కల్పించాలని, క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాజా ఆయిల్‌పామ్‌ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పంటలకు ఎంఎస్‌పీ అమలులో కేంద్ర–రాష్ట్రాలు కలిసి బాధ్యత వహించాలని తుమ్మల అన్నారు.

ఇదీ చదవండి: ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement