సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఇన్నోవా కారు నుజ్జునుజ్జయ్యింది. మృతులు.. కేతావత్ లింబ్య, జమున, మాన్‌సింగ్, వాస్రామ్‌గా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చౌడూరుగా తెలిపారు. డ్రైవర్ పేరు అశోక్ అని పోలీసులు చెప్పారు.
ప్రమాదానికి కారు అతివేగమా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.


