సాక్షి,హైదరాబాద్: రైతు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్‌లో శుక్రవారం జరిగిన ‘సదరన్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్’లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, దక్షిణాది రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
రైతులకు నిపుణుల సలహాలు అందించే ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. అలాగే, ఫర్టిలైజర్ సేల్ ఫ్రేమ్‌వర్క్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి తుమ్మల వెల్లడించారు. యూరియా యాప్‌తో సాధించిన విజయాన్ని ఈ విధానంలోనూ కొనసాగిస్తామన్నారు.
రైతు భరోసా: ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున ఇప్పటివరకు రూ.35,839 కోట్లు జమ. 2026 వానాకాలంలో కేవలం 9 రోజుల్లోనే 70.40 లక్షల మంది పట్టాదారులకు రూ.8,759 కోట్లు నేరుగా జమ.
రుణమాఫీ: ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ కింద 25 లక్షల కుటుంబాలకు లబ్ధి (సుమారు రూ.21 వేల కోట్లు ఖర్చు).
రైతు బీమా: గత మూడేళ్లలో ప్రీమియంగా రూ.3,531 కోట్లు చెల్లించి, 42 లక్షలకు పైగా రైతులకు బీమా భద్రత.
కేంద్రానికి మంత్రి తుమ్మల ప్రధాన విజ్ఞప్తులు
ఆయిల్‌పామ్ ధర భరోసా: లక్ష హెక్టార్లలో సాగు విస్తరణ జరుగుతున్నందున, తాజా గెలలకు (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలి; క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలి.
మార్కెట్ ధరల పతనంలో కొనుగోళ్లు: మొక్కజొన్న (రూ.6 వేల కోట్లు), జొన్న (రూ.1,100 కోట్లు) కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసామని, 25 శాతం పీఎస్‌ఎస్ పరిమితిని సడలించి నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. అదనపు కొనుగోళ్ల ఖర్చులో కేంద్రం భాగస్వామి కావాలి.
ఎల్‌నినో అసిస్టెన్స్ ఫండ్: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రత్యేకంగా ‘ఎల్‌నినో అసిస్టెన్స్ ఫండ్’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వికసిత్ తెలంగాణ 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని తుమ్మల పిలుపునిచ్చారు. మంచి విధానాలను పంచుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.


