పార్కింగ్ స్థలాల క్యూఆర్ కోడ్‌ల ఫ్లెక్సీ
భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం ఫ్రీ పార్కింగ్‌ల ఏర్పాటు
ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీపై ఆన్‌లైన్‌లో అప్‌డేట్
ప్రధాన కూడళ్లలో పార్కింగ్ కేంద్రాల క్యూ ఆర్ కోడ్‌ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈ పది రోజుల పాటు నెక్లెస్ రోడ్డుతో పాటు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ వాహనదారులతో కిక్కిరిసిపోతాయి. ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహా గణపతికి దారి తీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతుంటారు. కానీ ఈసారి ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. మహా గణపతి దర్శనంతో పాటు నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వస్తున్న వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఇప్పటికే తగు ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకున్నారు.
ప్రధాన కూడళ్లలో పార్కింగ్ స్థలాల ఫ్లెక్సీలు..
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నగర నలుమూలల నుంచి వస్తున్న భక్తులు, వారి వాహనాల పార్కింగ్‌కు స్థలాలను గుర్తించిన అధికారులు వాటిని తెలియజేసేందుకు వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడికి దారి తీసే నాలుగు మార్గాల్లో అధికారులు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ స్థలాలకు వెళ్లే మ్యాప్‌లను క్యూ ఆర్ కోడ్‌లుగా తయారు చేసి ఫ్లెక్సీలు వేసి అవగాహన కల్పిస్తున్నారు.
వాహనదారులు నేరుగా తాము వస్తున్న ప్రాంతంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నేరుగా అక్కడికి వెళ్లవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఐ మ్యాక్స్ థియేటర్ వద్దతో పాటు, హెచ్‌ఎండీఏ ఎదురుగా ఉన్న ఐ మ్యాక్స్ పార్కింగ్‌స్థలం, ఈ–కార్ రేసింగ్ స్థలం, అమరవీరుల స్మారకం వద్ద పార్కింగ్ స్థలాలను అధికారులు ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియాలో ట్రాఫిక్ రద్దీపై అప్‌డేట్..
మరో వైపు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఖైరతాబాద్ చుట్టూ పక్కల ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌తో పాటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లలో ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు గంటగంటకు సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీటిని చూస్తున్న వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు సాగుతున్నారు.
సాధారణ రోజుల్లో సాయంత్రం.. సెలవు రోజుల్లో రోజంతా..
ఖైరతాబాద్ మహా గణపతికి వీక్షించే వారి సంఖ్యతో పాటు నిమజ్జన వేడుకల్లో పాల్గొనే వారు సాధారణ రోజుల్లో సాయంత్రం వేళల్లో, శుక్ర, శని, ఆదివారాల్లో అత్యధికంగా వస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్లుగానే వాహనాల దారి మళ్లింపుతో పాటు వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలాలను గుర్తించారు.
ఇదీ చదవండి: రైల్వే టికెట్ల బుకింగ్.. కీలక విషయాలు
సెలవు రోజుల్లో, వారాంతాల్లో సుమారు 2 లక్షల మందికిపైగా వచ్చే భక్తులకు వారి వాహనాల పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే స్థలాలు గుర్తించినప్పటికీ అధికారులు మాత్రం ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చే వారు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుందని పార్కింగ్ స్థలాలు కూడా సరిపోయే అవకాశం ఉండదని అందువల్ల మెట్రోతో పాటు బస్సు, ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


