22A పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైలెవల్‌ కమిటీ ఏర్పాటు | High-Level Committee Formed to Resolve Telangana 22A Land Disputes | Sakshi
Sakshi News home page

22A పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైలెవల్‌ కమిటీ ఏర్పాటు

Sep 18 2026 11:37 AM | Updated on Sep 18 2026 11:42 AM

High-Level Committee Formed to Resolve Telangana 22A Land Disputes

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ముగ్గురు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కమిటీ ఏర్పాటైంది. రెవెన్యూ, న్యాయ, రిజిస్ట్రేషన్‌ సంబంధిత అంశాలను పరిశీలించి 22ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించడమే కమిటీ ప్రధాన ఉద్దేశం.

ముగ్గురు అధికారులతో కమిటీ
22ఏ భూముల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. లా సెక్రటరీ పాపిరెడ్డి, ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై వచ్చిన అభ్యంతరాలు, రికార్డులు, చట్టపరమైన అంశాలను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది.

ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కారం
22ఏ జాబితాలో చేరిన ప్రైవేటు భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సందర్భాల్లో అర్హత ఉన్న యజమానులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హత ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేలా కమిటీ పనిచేయనుంది. ఇటీవల అసెంబ్లీలో 22ఏ భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 12 అంశాలతో కూడిన కార్యాచరణను ప్రకటించారు. ఇందులో అసైన్డ్‌ భూములు, ఆమోదిత లేఅవుట్లలోని భూములు, జీఓ 59, జీఓ 118, నాలా చార్జీలు, అనధికార లేఅవుట్లు తదితర అంశాల పరిష్కారానికి చర్యలు ప్రకటించారు.

పొంగులేటి ఆదేశాలతో..
ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రకటన నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. 22ఏ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఈ కమిటీ నిర్ణయాలు కీలకం కానున్నాయి.

ఇదీ సమాచారం: సిద్దిపేటలో హైటెన్షన్‌.. ఎర్రవల్లి సర్వేకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement