సరదాగా గడుపుదామని వెళ్లిన నవ దంపతులకు చేదు అనుభవం అనుభవం ఎదురైంది. క్షణాల్లోనే మంటల్లో చిక్కుకున్న భార్యను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లయి రెండు నెలలే.. కొత్త జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించేందుకు భార్యాభర్తలు విహారయాత్రకు వెళ్లారు. ప్రకృతి అందాల మధ్య సరదాగా గడుపుతూ బార్బెక్యూ చేసుకుంటున్నారు. అంతలోనే ఓ వ్యక్తి చేసిన పని ఊహించని ప్రమాదానికి దారితీసింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు నవ వధువు నిఖితా దాస్‌ను చుట్టుముట్టాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆమె అగ్నికీలల్లో చిక్కుకుంది. కళ్లముందే భార్య మంటల్లో కాలిపోతుండటంతో భర్త సమీర్ ఆమెను కాపాడేందుకు పరుగులు తీశాడు. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లా సిటాంగ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
బార్బెక్యూ దగ్గర ఏం జరిగింది?
చోప్రాకు చెందిన సమీర్ దాస్, తన భార్య నిఖితతో కలిసి విహారయాత్ర కోసం సిటాంగ్‌కు వెళ్లారు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. అక్కడి ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేస్తున్న ఈ జంట.. బార్బెక్యూ సెషన్‌లో పాల్గొంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. దంపతులు బార్బెక్యూ దగ్గర కూర్చుని ఉండగా, ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి లేచి వచ్చి క్యాన్‌లోని ద్రవాన్ని మంటలపై పోసినట్లు కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి నిఖిత వైపు దూసుకెళ్లాయి.
భార్యను కాపాడేందుకు భర్త పరుగులు
మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో నిఖిత అగ్నికీలల్లో చిక్కుకుని కిందపడిపోయింది. వెంటనే స్పందించిన సమీర్.. భార్యను రక్షించేందుకు పరుగెత్తాడు. ద్రవాన్ని పోసిన వ్యక్తి కూడా తన టీ షర్టును విప్పి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీలో కనిపిస్తోంది. ఈ ఘటనతో రిసార్ట్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సిబ్బంది, అక్కడున్న ఇతరులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం నిఖితను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిఖిత ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
हनीमून पर गए कपल को बारबेक्यू का शौक पड़ा भारी, आग की चपेट में आने से दुल्हन 60% झुलसी#Westbengal pic.twitter.com/Ww5VpWljeJ
— Mangal Yadav (@MangalyYadav) September 17, 2026
రిసార్టుల్లో భద్రతపై ప్రశ్నలు
బార్బెక్యూ నిర్వహణలో మండే స్వభావం ఉన్న ద్రవాలను బహిరంగ మంటల సమీపంలో ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. రిసార్టుల్లో అగ్నిమాపక పరికరాలు, సురక్షిత ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన అవసరంపై చర్చ మొదలైంది.
ఇదీ చదవండి: నర్సుపై ఘాతుకం..


