కొనియాడిన బీజేపీ శ్రేణులు
ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేసిన కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు
మోదీని అవిశ్రాంత కృషి, త్యాగం, దూరదృష్టికి ప్రతీక: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని, అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనలో ఆయన అందించిన సేవలను ప్రశంసించారు.
‘దేశ సేవకు అంకితమైన కర్మయోగి, స్ఫూర్తిదాత నరేంద్ర మోదీ’అని కొనియాడారు. మోదీని అవిశ్రాంత కృషి, త్యాగం, దూరదృష్టికి ప్రతీకగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. దేశ సేవనే లక్ష్యంగా మార్చుకున్న మోదీ జీవితం తపస్సు, త్యాగం, అచంచలమైన సంకల్పాల అద్భుత గాథ అని పేర్కొన్నారు. సేవాభావం, అంకితభావంతో కూడిన ఆయన ప్రస్థానం కోట్లాది మంది దేశప్రజలకు స్ఫూర్తిదాయకమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, స్వయం సమృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు. దేశమే ప్రథమం అనే సంకల్పంతో సాగిన మోదీ ప్రయాణం సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమంతో కూడిన ఒక స్ఫూర్తిదాయకమైన గాథ అని తెలిపారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ప్రయాణం మాత్రమే కాదని, దేశ ప్రజల సామూహిక స్వప్నం అని ఉద్ఘాటించారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమం, ఆవిష్కరణల వంటి రంగాల్లో పురోగతి సాధిస్తూ, ‘వికసిత్ భారత్’లక్ష్యం దిశగా దేశం పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. మోదీని దేశ సేవ, ప్రజా సంక్షేమం కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేసిన కర్మయోగిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు.
కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, సి.ఆర్.పాటిల్, శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ, పార్టీ ఎంపీలు అనిల్ బలూనీ, సంబిత్ పాత్ర, సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్, రాఘవ్ చద్ధా, గౌరవ్ భాటియా తదితరులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్గున ఖర్గే సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో మోదీ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రధానమంత్రికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లోనూ మోదీ పుట్టిన రోజు కార్యక్రమాల్లో అభిమానులు పాల్గొన్నారు.
ఈ ఘనత మోదీకే చెందుతుంది: ముర్ము
సుపరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు సమ్మిళిత అభివృద్ధికి అపూర్వమైన వేగాన్ని, కొత్త దిశను అందించిన ఘనత ప్రధాని మోదీకి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
మోదీకి సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
ప్రధాని మోదీకి పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ప్రముఖ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, కమల్ హాసన్, మోహన్ లాల్, చిరంజీవి, రామ్‌చరణ్ తేజ, నాగార్జున, జాకీ ష్రాఫ్, కాజోల్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు.
ప్రపంచ దేశాల అధినేతలు
రష్యా అధినేత పుతిన్ సహా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరఫున భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మోదీకి శుభాకాంక్షలు తెలిపింది.
33.27 లక్షల దీప కాంతులతో ప్రపంచ రికార్డు
ఉజ్జయిని: ప్రధాని మోదీ 76వ జన్మదినం ప్రపంచ రికార్డుకెక్కింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గురువారం సాయంత్రం క్షిప్రా నదీ తీరంలో 33.27 లక్షల మట్టి ప్రమిదలను ఏకకాలంలో వెలిగించారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రాత్రి 7 గంటలకు సైరన్ మోగగానే ‘ఆశీర్వాద్ కా దియా’కార్యక్రమంలో భాగంగా మూడు నిమిషాల్లోనే 33.27 లక్షల దీపాలు వెలిగించారని చెప్పారు. మధ్యప్రదేశ్ అంతటా ఒకేసారి మొత్తం 3.55 కోట్ల దీపాలను వెలిగించినట్లు పేర్కొన్నారు.
ఒడిశాలో కోటి దీపోత్సవం
భువనేశ్వర్: మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఒడిశా అంతటా సుమారు కోటి దీపాలను వెలిగించారు. రాజధాని భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర్ ఆలయంలో జరిగిన ‘ఆశీర్వాద్ కా దియా’లో సీఎం మోహన్ చరణ్ మాఝీ పాల్గొన్నారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని కాశీ క్షేత్రంలో పూజలు, యాగాలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడి మందిరంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పూజలు నిర్వహించారు. అలాగే వారణాసి నుంచి గుజరాత్‌లోని వాద్‌నగర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీని రాజ్‌నాథ్ ప్రారంభించారు.
‘ఆశీర్వాద్ కా దియా’నా హృదయాన్ని తాకింది: మోదీ
‘ఆశీర్వాద్ కా దియా’అనే పాట నేపథ్యంతో, వివిధ సందర్భాల్లో పౌరులతో తాను గడిపిన క్షణాలను చూపించే వీడియోను రూపొందించిన వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత గృహవసతి, వైద్య సేవలు, విద్యుత్, వంట గ్యాస్‌తో సహా మోదీ ప్రభుత్వంలోని వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన పౌరుల స్పందనలు ఈ వీడియోలో ఉన్నాయి. దీనిపై మోదీ స్పందిస్తూ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కొన్ని అంశాలు ఎంతో ప్రత్యేకమైనవని, అలాంటి ఆప్యాయతకు నిదర్శనమైన ‘ఆశీర్వాద్ కా దియా’తన హృదయాన్ని గాఢంగా తాకిందని పేర్కొన్నారు. ప్రజలు అందించే ప్రతి ఆశీర్వాదం మన దేశానికి మరింత భక్తిశ్రద్ధలతో సేవ చేయాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని వివరించారు.


