భోపాల్: మనల్ని మనం పరిచయం చేసుకోవాలంటే ముందుగా పేరు చెబుతాం. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఇలాగే పరిచయం చేసుకునే సమయంలో తమ పేరు చెబుతారు. అయితే, వారి పేరు చెప్పగానే మనం ‘‘నువ్వు చెబుతున్నది నిజమేనా? జోక్ చేస్తున్నావా’’ అంటాం. ఎందుకంటే వారి ఐదుగురి పేర్లు నరేంద్ర మోదీ.
దేశ ప్రధాని పేరు కూడా నరేంద్ర మోదీనే కావడంతో మధ్యప్రదేశ్‌లోని మిగతా ఐదుగురు నరేంద్ర మోదీలు పేరు విషయంలో తిప్పలు పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అధికారిక జనన రికార్డులను పరిశీలించగా ఇలాంటి పేరుతో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.
బుర్హాన్‌పూర్‌లో 67 ఏళ్ల నరేంద్ర మోదీ
వారిలో అత్యంత పెద్దవారు బుర్హాన్‌పూర్‌కు చెందిన 67 ఏళ్ల నరేంద్ర మోదీ. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన.. రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్‌గా కూడా ఉన్నారు. పేరు కారణంగా ఎదురయ్యే గందరగోళానికి ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది.
ఢిల్లీలో జరిగిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో తొలిసారి గుర్తుండిపోయే ఘటన ఎదురైంది. తన పేరు చెప్పగానే అక్కడి క్లర్క్ అనుమానంగా చూస్తూ.. “జోక్ చేస్తున్నారా?” అని అడిగారు. గుర్తింపు కార్డు చూపించినా ఆయన నమ్మలేదు. కొంతసేపు వివరించిన తర్వాత “సారీ, సారీ” అంటూ వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి గుర్తింపు కార్డును ఎప్పుడూ చేతికి అందుబాటులో ఉంచుకోవడం ఆయనకు అలవాటైంది.
ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బ్యాంకులకు ఆకస్మిక ఫోన్ కాల్స్ చేసి జన్‌ధన్ ఖాతాల పురోగతిని సమీక్షిస్తున్న సమయంలోనూ పేరు కారణంగా సరదా ఘటన ఎదురైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విద్యార్థుల స్కాలర్‌షిప్ పనుల కోసం బ్యాంకు మేనేజర్లకు ఫోన్ చేసేవారు. ఒకసారి స్థానిక ఎంపీకి ఫోన్ చేసినప్పుడు, అనుకూలమైన సమయంలో తిరిగి కాల్ చేస్తానని చెప్పగా.. ఎంపీ సరదాగా, “నా మొబైల్‌లో నరేంద్ర మోదీ పేరు కనిపించడం నాకు గౌరవంగా ఉంటుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు అది ప్రధాని నుంచి వచ్చిన కాల్ అనుకుంటారు” అని అన్నారు.
మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద భారీ రద్దీ సమయంలో భద్రతా సిబ్బంది ఆయనను ఆపారు. “నేను నరేంద్ర మోదీని” అని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. అయితే గుర్తింపు కార్డు చూపించగానే నవ్వుకున్నారు.
టీ అందించే వారి పేరు నరేంద్ర మోదీ
దేవాస్‌లోని కార్యాలయ క్యాంటీన్‌లో టీ అందించే మరో నరేంద్ర మోదీకి కూడా ఇదే అనుభవం. “నా పేరు నరేంద్ర మోదీ అని చెప్పగానే ప్రజలు ఆశ్చర్యపడతారు. కాసేపు ఆగి నవ్వుతారు. కస్టమర్లు నవ్వుతూ జోకులు వేస్తారు. అయితే నా పేరును మాత్రం ఎవరూ మర్చిపోరు” అని ఆయన తెలిపారు.
పితాంపూర్‌లో మరో నరేంద్ర మోదీ ఎన్నో ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన సుమారు 15 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. తన పేరుతోనే ‘మోదీ టీ స్టాల్’ పెట్టుకున్నారు. ప్రధాని పేరుతో దుకాణానికి ఆ పేరు పెట్టారా అని కస్టమర్లు అడిగితే.. అది పుట్టుకతో వచ్చిన పేరు, తాను ఎంచుకున్నది కాదని వివరిస్తారు. యూపీఐ చెల్లింపుల సమయంలో ఫోన్ తెరపై ప్రధాని ముఖం కనిపించడంతో కస్టమర్ల స్పందన మరింత ఆసక్తికరంగా మారుతుంది.
దేవాస్‌లోని బాల్‌గఢ్‌కు చెందిన 50 ఏళ్ల మరో నరేంద్ర మోదీ 17 ఏళ్ల పాటు టీ దుకాణం నడిపారు. ఆ తర్వాత ఆటోమొబైల్ సంస్థలో చేరారు. పేరు కారణంగా వచ్చే సరదా వ్యాఖ్యలు ఆయనకూ కొత్తేమీ కాదు. మధ్యప్రదేశ్‌లోని అధికారిక జనన రికార్డులను పరిశీలించగా మరో వ్యక్తి పేరు కూడా నరేంద్ర మోదీ అని ఉంది.


