నిజాంను పొగిడే నేతల డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలి: బండి సంజయ్‌ | Bandi Sanjay Kumar Sensational Comments On Leaders Who Praise Nizam | Sakshi
Sakshi News home page

నిజాంను పొగిడే నేతల డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలి: బండి సంజయ్‌

Sep 17 2026 12:17 PM | Updated on Sep 17 2026 1:12 PM

Bandi Sanjay Kumar Sensational Comments On Leaders Who Praise Nizam

ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేల్‌ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందని.. అలాంటిది నిజాంను పొగిడే నాయకులు ఓసారి ఇక్కడి పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కాస్త తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.

గురువారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్రం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ నాలుగు పండుగలు ఒకేసారి వచ్చాయని ఆయన అన్నారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకేరోజు రావడం ప్రత్యేకమన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్ర్యం పొందితే.. తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు.

నిజాం పాలనపై తీవ్ర వ్యాఖ్యలు
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ప్రజలు విమోచనం సాధించుకున్నారని బండి సంజయ్‌ అన్నారు. వీర బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాంటి చరిత్రను పక్కనపెట్టి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.

నిజాంను పొగిడే నాయకులు తెలంగాణ పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో నిజాంను ప్రశంసిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని రక్తపాతం సృష్టించిన నిజాం పాలనను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. నిజాంను పొగిడే నేతలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని, అసలు వారు ఈ దేశ పౌరులేనా? లేక విదేశీ డీఎన్‌ఏ ఉందా? అనేది చూడాలంటూ వ్యాఖ్యానించారు.

చరిత్రను భావితరాలకు చెప్పాలి
తెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్‌ చెప్పారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిన చరిత్ర మోదీ ప్రభుత్వానిదేనని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

అవినీతిపై విమర్శలు
కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని బండి సంజయ్‌ విమర్శించారు. అవినీతికి తావులేకుండా మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు.

తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలో ఆలోచించుకోవాలని ఆయన కోరారు. అవినీతిమయమైన పాలన కావాలా? అవినీతి రహిత పాలన కావాలా? తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసే పాలన కావాలా? లేక ఆ చరిత్రను భావితరాలకు అందించే పాలన కావాలా? అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీకి ప్రతి తెలంగాణ పౌరుడు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్‌ కోరారు.

విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాట చరిత్రను పాట, సంగీతం, దృశ్యరూపంలో ప్రజలకు అందించిన ఆకుల నాగేశ్వర్‌, వందేమాతరం శ్రీనివాస్‌, దీపికలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇదీ చదవండి: ‘ఎవరి ఆస్తులు ఎంతో తేలుద్దామా?’.. కేటీఆర్‌ సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement