KBR Park: ఇక అదే దారి | KBR Park Traffic Fix, Hyderabad Govt Considers Permanent One Way System Instead Of Costly Flyovers And Underpasses | Sakshi
Sakshi News home page

KBR Park: ఇక అదే దారి

Sep 17 2026 10:58 AM | Updated on Sep 17 2026 11:31 AM

One Way Traffic System In KBR Park

కేబీఆర్‌ పార్కు రోడ్డులో నిలిచిన ఫ్లై ఓవర్‌ పనులు

హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ చిక్కుల తొలగింపునకు హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడేసి చొప్పున ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మించాలని తలపెట్టింది. ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ వన్‌వే అమలు చేసింది. దీనికోసం చేసిన మార్పులు చేర్పులతో ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పాయి. 

దీంతో అధికార యంత్రాంగం రూ.1,250 కోట్లు వెచ్చించి.. ఏళ్లు శ్రమించి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడం కంటే శాశ్వత ప్రాతిపదికన వన్‌వే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే.. తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారిన పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ఒక ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని భావిస్తున్నారు. నాగార్జున సర్కిల్‌ నుంచి రోడ్డు నెం.36 వరకు లేదా రోడ్డు నెం.45 వరకు ఇది ఉండాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరాయి. వీటిలో ఏదో ఒకటి ఖరారు చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

వాహన చోదకుల ఫీడ్‌బ్యాక్‌.. 
‘హెచ్‌–సిటీ’ పనుల్లో భాగంగా అధికారులు గత నెల 18 నుంచి కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌ వే అమలు చేశారు. ఇది అమల్లోకి వచి్చన పది రోజుల్లోనే ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గి ఫలితాలు కనిపించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నామంటూ వాహన చోదకుల నుంచి ట్రాఫిక్‌ పోలీసులకు ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. దీంతో కేబీఆర్‌ పార్కు చుట్టూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు దాదాపు రెండేళ్లు వన్‌వే అమలు చేయాలని భావించిన అధికారులు.. ఈ విధానం శాశ్వతం చేయాలని నిర్ణయించారు. 

మరోపక్క కేబీఆర్‌ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి యంత్రాగానికి సవాళ్లు ఎదురయ్యాయి. చెట్ల కొట్టివేతను నిరసిస్తూ కేబీఆర్‌ పార్కు వాకర్లతో పాటు పర్యావరణవేత్తలు, సేవ్‌ కేబీఆర్‌ ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ™ దీంతో పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి.  

పలు పరిణామాలతో.. 
చెట్లను కొట్టివేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉండటంతో సదరు నిర్మాణ రంగ సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు ఎన్నిచెట్లు మిగిలి ఉన్నాయో వాటి జియో ట్యాగ్‌ను కూడా పర్యావరణవేత్తలు తీసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఒక్క చెట్టును కూడా కొట్టడానికి వీల్లేకుండాపోయింది. దీనికి తోడు ఈ నిర్మాణాల కోసం మొత్తం 247 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో పలువురు ప్రము ఖులవీ ఉన్నాయి. ఈ కారణంగా వీటి సేకరణ పెను సవాల్‌గా మారింది. 

పలువురు ఇళ్ల యజమానులు భూసేకరణను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కేబీఆర్‌ పార్కుకు నిర్ణయించిన ఎకో సెన్సిటివ్‌ జోన్‌పై సుప్రీం కోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ పరిణామాలకు శాశ్వత వన్‌ వే ఓ పరిష్కారం చూపింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ వన్‌వేలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం హెచ్‌–సిటీ పనులు ఆగిపోయాయి. ఈ పనులతో పోలిస్తే ఎలివేటెడ్‌ కారిడార్‌కు చాలా తక్కువే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు.  

ఇదీ చదవండి: నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement