ప్రజలే కేంద్రంగా పాలన.. హైదరాబాద్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ: రేవంత్‌ | CM Revanth Reddy Highlights People Centric Governance On September 17th, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రజలే కేంద్రంగా పాలన.. హైదరాబాద్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ: రేవంత్‌

Sep 17 2026 10:40 AM | Updated on Sep 17 2026 11:48 AM

CM Revanth reddy Key Comments On September 17th

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైన రోజుగా సెప్టెంబర్‌ 17ను గుర్తిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ప్రజలు పోరాడిన చరిత్ర ఉందని, పాలకులపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్‌ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన వారికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడారు. ప్రజల మాటకు విలువ ఇవ్వడం, ప్రభుత్వ వనరులు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే ప్రజాపాలన అని పేర్కొన్నారు. పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతు భరోసా కింద రూ.20,616 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని, ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసాతో పాటు రైతు బీమా, భూభారతి సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లతో ప్రణాళిక రూపొందించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. దళితులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుతో పాటు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి రూ.927 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపైనా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగ పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఇటీవల టిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తూ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంపై దృష్టి పెట్టామని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును 55 కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047 ద్వారా భవిష్యత్‌ తెలంగాణ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవమే ప్రజాపాలనలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ‘స్టార్టప్‌ స్టేట్‌గా తెలంగాణ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement