ఖమ్మం జిల్లా: ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ... ఓ రైతు కలుపు మందు తాగడమేకాక తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించాడు. ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) స్వగ్రామంలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయిలో భూమి కౌలుకు తీసుకుని భార్యతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.
ఈక్రమాన భార్య అప్పలనరసింహాపురంలోని ఇంట్లో ఉండగా... సూర్యాపేట జిల్లా కోదాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న కుమార్తె లాస్య (14), నేలకొండపల్లి మండలం చెరువుమాధారం ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న కుమారుడు నిఖిల్ (11)ను బుధవారం వారి పాఠశాలలకు వెళ్లి తీసుకొచ్చాడు. ఆపై పిల్లలతో కలిసి గండ్రాయిలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లాడు.
తండ్రి ఇచ్చింది విషమని తెలియక...
ముందుగా శ్రీనివాస్ థమ్సప్ సీసాలో గడ్డి మందు కలిపినట్లు తెలుస్తుండగా, పొలం వద్ద తొలుత తాను తాగాడు. ఆ తర్వాత లాస్య, నిఖిల్‌కు కూడా తాగించాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియని ఆ చిన్నారులు సైతం తాగేశారు. ఆపై బంధువులకు ఫోన్ చేసిన శ్రీనివాస్ విషయాన్ని చెప్పి స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంధువులు, గ్రామస్తులు గండ్రాయిలోని పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.
చివరకు పోలీసుల సాయం తీసుకుని ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గుర్తించేసరికి ముగ్గురూ స్పృహ తప్పి కనిపించాడు. ఈ మేరకు శ్రీనివాస్, ఇద్దరు పిల్లలను ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ తండ్రి, కుమార్తె లాస్య మృతి చెందారు. ఇక కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. శ్రీనివాస్‌కు గ్రామంలో ఉత్తమ రైతుగా పేరుండటమేకాక అందరితో కలివిడిగా ఉండేవాడు. దీంతో ఆయన ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఏపీలోని చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


