22-A భూములపై మహేశ్‌ కుమార్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు | TPCC Chief Mahesh Kumar Key Comments On 22A Lands | Sakshi
Sakshi News home page

22-A భూములపై మహేశ్‌ కుమార్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Sep 17 2026 11:38 AM | Updated on Sep 17 2026 11:38 AM

TPCC Chief Mahesh Kumar Key Comments On 22A Lands

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో 22-A భూముల వివాదం రాజకీయంగా వేడెక్కుతున్న వేళ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22-A భూముల వ్యవహారంలో తప్పు కాంగ్రెస్‌ పార్టీది కాదని.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ అంశంపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ జరగాలా? లేదా? అనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్ ఢిల్లీలో ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన వారు సర్వం కోల్పోతే.. కేసీఆర్‌ కుటుంబం మాత్రం భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించడం అభినందనీయమన్నారు. 22-A భూముల అంశంపై బీఆర్‌ఎస్‌ ఇప్పటికే జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌ చేస్తుండగా.. ప్రభుత్వం కూడా భూ వ్యవహారాలపై విచారణకు చర్యలు చేపట్టింది.

కాగా, తన పదవీకాలానికి మరో ఏడాది సమయం ఉందని మహేశ్‌కుమార్‌ గౌడ్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ జరపాలా? వద్దా? అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో పెండింగ్‌లో ఉన్న పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లలో సంస్థాగతంగా సాధించిన పురోగతిని అధిష్టానం పెద్దలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. గాంధీభవన్‌ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. 22-A భూముల అంశంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. 22-A జాబితాలో భూముల చేర్పుపై బీఆర్‌ఎస్‌ జ్యుడీషియల్‌ విచారణ కోరుతుండగా.. కాంగ్రెస్‌ గత ప్రభుత్వ హయాంలోని భూ వ్యవహారాలను ప్రస్తావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్‌ సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement