భారత్‌లో జిన్‌పింగ్‌కు స్ట్రోక్‌?.. మోదీ విందుకు దూరం? | China Wanjun Xie claim jinping suffered stroke And fainted at BRICS | Sakshi
Sakshi News home page

భారత్‌లో జిన్‌పింగ్‌కు స్ట్రోక్‌?.. మోదీ విందుకు దూరం?

Sep 17 2026 7:26 AM | Updated on Sep 17 2026 7:26 AM

China Wanjun Xie claim jinping suffered stroke And fainted at BRICS

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆరోగ్యంపై తాజాగా షాకింగ్‌ ప్రచారం మొదలైంది. భారత్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్ర ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) బారినపడ్డారని చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్‌ వాంజున్‌ షీ ఆరోపించారు. అయితే ఈ ప్రచారంపై చైనా, భారత్‌ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

బ్రిక్స్‌ విందుకు దూరం.. 
ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటించిన జిన్‌పింగ్‌.. సెప్టెంబర్‌ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. అయితే మోదీ భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మాత్రం ఆయన హాజరుకాలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా పలువురు నేతలు విందులో పాల్గొనగా.. చైనా తరఫున విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ప్రాతినిధ్యం వహించారు.

సుదీర్ఘమైన కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి జిన్‌పింగ్‌ హోటల్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే విందుకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై అధికారిక వివరణ రాలేదు. ఇదే సమయంలో బ్రిక్స్‌ సదస్సులో మోదీ ప్రసంగం సందర్భంగా జరిగిన ఓ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చర్చకు వచ్చింది. మోదీ.. చైనా ప్రతినిధి బృందం వైపు తిరిగి ఇట్స్‌ ఓకేనా? అని అడగడం, జిన్‌పింగ్‌ స్పందించినట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.

ఆసుపత్రిలో అత్యవసర చికిత్స?
చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్‌ వాంజున్‌ షీ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ జిన్‌పింగ్‌ ఆరోగ్యంపై పలు ఆరోపణలు చేశారు. బ్రిక్స్‌ సదస్సులో ఆయన స్పృహ కోల్పోయారని, వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు తరలించారని ఆరోపించారు. భారత్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి భారత అధికారులకు తెలిసిపోతుందనే భయంతో జిన్‌పింగ్‌ నిరాకరించారని కూడా షీ పేర్కొన్నారు. బీజింగ్‌కు చేరుకున్న వెంటనే ఆయనను సైనిక హెలికాప్టర్‌లో 301 ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపించారు.

అక్కడి వైద్యులు జిన్‌పింగ్‌కు తీవ్ర ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు గుర్తించారని, విమాన ప్రయాణం కారణంగా అత్యవసర చికిత్సకు కీలకమైన సమయం కోల్పోయారని షీ తన పోస్టుల్లో పేర్కొన్నారు. విమానంలో శస్త్రచికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారని ఆరోపించారు. జిన్‌పింగ్‌కు 301 ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారని వాంజున్‌ షీ మరో పోస్టులో పేర్కొన్నారు. ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి ఇంకా బయటపడలేదని ప్రచారం చేశారు. అంతేకాకుండా చైనా సైనిక కమాండ్లు, గ్రూప్‌ ఆర్మీలు అప్రమత్త స్థితికి చేరుకున్నాయని, దేశంలో పరిణామాలను పర్యవేక్షిస్తున్నాయని కూడా ఆరోపించారు.

ఎవరీ వాంజున్‌ షీ?
జిన్‌పింగ్‌ ఆరోగ్యంపై ఆరోపణలు చేసిన వాంజున్‌ షీ.. చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను డెమోక్రసీ పార్టీ ఆఫ్‌ చైనా అని కూడా పిలుస్తారు. 1998లో చైనాలో ఏర్పాటైన ఈ రాజకీయ సంస్థను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నిషేధించింది. బహుళపార్టీ ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ఎన్నికలు, అధికారాల విభజన, భావప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన వంటి అంశాల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ప్రకటించుకుంది. పార్టీ ఏర్పాటులో భాగమైన పలువురు ప్రజాస్వామ్య కార్యకర్తలను చైనా అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మానవ హక్కుల సంస్థలు గతంలో నివేదించాయి. ప్రస్తుతం ఈ సంస్థ చైనా వెలుపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement