నేడు అంతర్జాతీయ సంగీత దినోత్సవం
‘‘అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ పాట టాప్‌లోనే ఉంటుంది. పోటీలో ఉన్నది పాట గానీ మనుషులు కాదని నా ఫీలింగ్. మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను ఎప్పుడూ ఒక కూలీనే. సాధారణంగా ఓ రైతు ఎలా ఉంటాడో, సాధారణ కార్మికుడు ఎలా ఉంటాడో, కూలి పని చేసుకునే వాళ్లు ఎలా ఉంటారో నేను కూడా అంతే’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. నేడు అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్స్ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా పంచుకున్న విశేషాలు...
→ రోజూ సంగీత దినోత్సవమే...
రోజూ నేను సంగీత ప్రపంచంలోనే ఉంటాను కాబట్టి దేవుడి పాదాల చెంత ఉన్నట్టే ఉంటుంది. రోజూ ఇలాంటి అనుభూతితోనే ముందుకు వెళ్తుంటాను. నేనెప్పుడూ సంగీతంతో సహవాసం చేస్తుంటాను కాబట్టి రోజూ సంగీత దినోత్సవమే.
→ 30 ఏళ్లు ముందుకి...
ఓ పాటను మొదలు పెట్టినప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుందంటే... ఆ పాటని ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు గర్వంగా ఉండాలి, విజయకేతనం ఎగరవేయాలి. మారుతున్న కాలానికి, మనుషుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా, శ్రోతలు వినే ఒరవడికి తగ్గట్టుగా ఆలోచిస్తాను. 20 ఏళ్ల తర్వాత అప్పటి యువత ఈ పాట వింటే ఎలా ఉంటుంది? 30 ఏళ్ల తర్వాత తిరిగి ఆ పాటను మనం వింటే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తాను.
→ జానపద గీతం అమ్మలాంటిది
జానపద గీతం అమ్మ లాంటిది. జానపదం అంటే మట్టి నుంచి ఉద్భవించినటువంటి మొక్క. ఆ మట్టికి పచ్చదనంతో పాటు గాలిని, మంచి ఫలాలను ఇచ్చే గుణం కూడా ఉంటది. అలాంటి మట్టి పాటలు ఎప్పుడూ ప్రపంచానికి బోర్ కొట్టవు. అలాంటి పాటలు ఈరోజు సినిమాల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ప్రధాన పాత్రను ఎందుకు పోషిస్తున్నాయంటే అది మట్టి భాష. మట్టి నుంచి వెలువడే పరిమళం మనకు ఎంత అద్భుతమైన అనుభూతిని ఇస్తదో, మట్టి నుంచి వెలువడిన పాటలు కూడా అలా మనసును హత్తుకుంటాయి. అందుకే ప్రపంచ వేదిక మీద కూడా ప్రధానంగా జానపద గీతాలే ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం.
→ ప్రజలు నిర్మించిన సౌధాన్ని!
నేను ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్లతో పోటీ పడను. అంతేకాదు... మ్యూజిక్ డైరెక్టర్ల పోటీలో నేను లేను. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. భీమ్స్ అనేవాడు ఇక్కడ ఉంటే బాగుంటుంది. మన భాష పాటలు, మన మానసిక స్థితి, మన స్థితిగతులు తెలిసినవాడు ఇక్కడ ఉండాలని వాళ్లు తీసుకొచ్చి ఇండస్ట్రీలో కూర్చోబెట్టి పాటలు చేయించుకుంటున్నారు. నేను ప్రజల నుంచి ఉద్భవించిన పాటని. నేను కేవలం ప్రజలు నిర్మించిన సౌధాన్ని, వాళ్లు నియమించుకున్న ప్రతినిధిని మాత్రమే. వాళ్లు ఏం చెబితే అది చేస్తా.
→ సొంత మనిషిలా చూసుకుంటారు!
బయటికెళ్లినప్పుడు కొందరు నన్ను గుర్తుపట్టి.. ‘మీ పాటలు మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చాయి. మేము దుఃఖాల్లో ఉన్నప్పుడు మాకు భరోసానిచ్చాయి... ఆశలు చిగురింపజేశాయి. మీ పాటలు, మీ మాటలు మమ్మల్ని ఉత్తేజపరిచాయి’ అని అంటుంటారు. అయితే ఇవన్నీ ప్రజలే నాకు ఇచ్చిన ఆస్తి. నేను వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నది ధనమో లేదంటే బంగారమో కాదు. వారి దగ్గర నుంచి బుద్ధి, మంచి జ్ఞానం నేర్చుకున్నా. వాళ్ల ప్రేమ, ఆత్మీయత ఎలా ఉంటా యంటే సొంత మనిషిలాగా చూసుకుంటారు.
→ వ్యవసాయం చేస్తున్నాను
ప్రస్తుతం సంగీత దర్శకునిగా కొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం వ్యవసాయ రంగం మీద ఫోకస్ చేశా. మా నాన్న అంగోతు మంగ్యాగారు చెప్పడంతో ఊరిలో పొలం పనులు చేస్తున్నాను. మా నాన్న, నేను కలిసి వరి, పత్తి, పెసర్లు, వేరుశనగ పంటలు పండిస్తున్నాం. నేను రైతు బిడ్డనే కదా... రైతు బతుకే నాకు ఇష్టం. ఎంత మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. రైతు బిడ్డ రైతు అయితే అంతకంటే ఆనందం ఏముంది.
– డేరంగుల జగన్ మోహన్


