న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి పోరుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను సొంత పార్టీ నాయకత్వాన్ని విమర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ‘ఐఐఎంయూఎన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విపక్షాలు సరిగ్గా స్పందించలేకపోయాయని, యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే మార్గాలను పార్టీలు తెరవాలని తాను కోరినట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ చేపట్టిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమం పేపర్ లీక్ అంశాలను ముందే లేవనెత్తిందని, అయితే యువత ఆకాంక్షలకు తగినట్లుగా మన విధానాలు ఎందుకు ప్రతిధ్వనించలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని థరూర్ పేర్కొన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు తన మాటలను అసందర్భంగా వక్రీకరించి, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు తన పూర్తి ప్రసంగ వీడియోను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేస్తూ, రాజకీయాల్లో యువత కేవలం ప్రేక్షకులుగా కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకు ఇవ్వాలని, రాజకీయ పార్టీలు తమ తలుపులను కొత్త తరానికి తెరవాలని శశిథరూర్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!


