బీజేపీలో ఆయనే నా ఫేవరేట్‌.. ‘హలో అంకుల్‌’ అంటూ రాహుల్‌.. | Rahul Gandhi Calls Amarinder Singh His Favourite BJP Leader, Says He Shares A Good Bond With Him | Sakshi
Sakshi News home page

బీజేపీలో ఆయనే నా ఫేవరేట్‌.. ‘హలో అంకుల్‌’ అంటూ రాహుల్‌..

Aug 8 2026 10:39 AM | Updated on Aug 8 2026 11:21 AM

Amarinder Singh And Rahul Gandhi Comments Viral In Social Media

న్యూఢిల్లీ: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీలో తనకు ఇష్టమైన నాయకుడు ఎవరో చెబుతూ.. మాజీ పంజాబ్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరును రాహుల్‌గాంధీ ప్రస్తావించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్‌గాంధీ.. అమరీందర్‌ సింగ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ‘‘ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా కూల్‌. సైనిక చరిత్రపై ఆయనకు మంచి పట్టు ఉంది. హలో అంకుల్‌ అమరీందర్‌’’ అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. జెన్‌ జెడ్‌, విద్యార్థులతో మరింతగా మమేకమయ్యేందుకు రాహుల్‌గాంధీ ఈ ఇన్‌స్టాగ్రామ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే అమరీందర్‌ సింగ్‌పై చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది.

రాహుల్‌ వ్యాఖ్యలపై అమరీందర్‌ సింగ్‌ కూడా స్పందించారు. తన గురించి రాహుల్‌గాంధీ మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్‌, ప్రియాంక గాంధీలను చిన్నప్పటి నుంచే తనకు తెలుసని గుర్తుచేశారు. రాహుల్‌ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తనకు క్లాస్‌మేట్‌, స్నేహితుడని చెప్పారు. అయితే వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వేర్వేరు అని అమరీందర్‌ స్పష్టం చేశారు. రాహుల్‌, సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని.. కానీ రాజకీయంగా మాత్రం తాను బీజేపీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

అమరీందర్‌ వ్యాఖ్యలకు పంజాబ్‌ బీజేపీ నేతలు కూడా స్పందించారు. పంజాబ్‌ బీజేపీ అధికార ప్రతినిధి ప్రీత్‌పాల్‌ సింగ్‌ బలియావాల్‌.. అమరీందర్‌ సింగ్‌ను పంజాబ్‌లో అత్యున్నత స్థాయి నాయకుడిగా అభివర్ణించారు. అయితే కాంగ్రెస్‌ పంజాబ్‌ యూనిట్‌లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలోనే రాహుల్‌ ఆయనను గుర్తు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రాణా గుర్జీత్‌ సింగ్‌ మాత్రం రాహుల్‌, అమరీందర్‌కు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, అమరీందర్‌ గౌరవనీయమైన నాయకుడని అన్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడకుండా ఉంటే పార్టీలో అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవారని అభిప్రాయపడ్డారు.

అమరీందర్‌ సింగ్‌ ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక ప్రాంతీయ నాయకుడిగా ఉన్నారు. 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఘన విజయం అందించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల నేపథ్యంలో 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, 2022 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అనంతరం బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం అమరీందర్‌ కుటుంబ సభ్యులు కూడా బీజేపీలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత అనుబంధం కొనసాగుతుందని అమరీందర్‌ పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌గాంధీ చేసిన ‘హలో అంకుల్‌ అమరీందర్‌’ వ్యాఖ్య మరోసారి ఆ పాత రాజకీయ, కుటుంబ అనుబంధాలను తెరపైకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement