తమిళనాడు: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.60 లక్షల నష్టం ఏర్పడిందని రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగి కూవం నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిపై పిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది అతని కోసం గాలిస్తున్నారు. వివరాలు.. చెన్నై కే.కే. నగర్ కామరాజర్ శాలైలోని రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో మోహన్ (30) నివసిస్తున్నారు.
ఈయన ప్యారీస్ కార్నర్‌లోని రిజర్వ్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై ఆసక్తి ఉన్న మోహన్, గత ఏప్రిల్ నెలలో బ్యాంక్ నుండి రూ.30 లక్షల అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టారు. ఇదే విధంగా తన స్నేహితుల వద్ద నుండి కూడా రూ.30 లక్షలు అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకు భారీ నష్టం రావడంతో డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు. పైగా అప్పు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో మోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ స్థితిలో బుధవారం రాత్రి కోటూర్‌పురం వంతెన వద్దకు వచ్చిన మోహన్, హఠాత్తుగా వంతెన పైకి ఎక్కి కూవం నదిలోకి దూకేశారు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన స్థానికులు పోలీసులకు, అగి్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కోటూర్‌పురం పోలీసులు మరియు మైలాపూర్ అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో మునిగిపోయిన మోహన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం కూడా ఆయన కోసం వెతికే పని కొనసాగింది. దీనిపై కోటూర్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


