సాక్షిచెన్నై: తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. సంగీత నిర్ణయంతో చెంగల్‌పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానం ఈ విడాకుల కేసు విచారణను పూర్తిగా ముగించింది. సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత ఈ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళితే..ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సీఎం విజయ్ భార్య సంగీత, తమ మధ్య పరిష్కరించుకోలేని తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టును ఆశ్రయించారు. విజయ్‌తో తన వివాహ బంధాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడంతో పాటు, తనకు భరణం (జీవనభృతి) చెల్లించాలని, అలాగే చెన్నై నీలంకరైలోని తమ సొంత నివాసంలోనే నివసించేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు.
ఈ హైప్రొఫైల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టినప్పటికీ, గతంలో జరిగిన పలు విచారణలకు సీఎం విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. గత నెలలో జరిగిన విచారణకు సైతం ఇరుపక్షాలు గైర్హాజరవడంతో, న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి (శుక్రవారం) వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో, నేడు (శుక్రవారం) జరిగిన విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై.. తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. దీంతో చెంగలపట్టు కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ కేసును క్లోజ్ చేసింది. గతంలో జరిగిన విచారణల సందర్భాలలో ఇరుపక్షాల తరఫున కేవలం వారి న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. సీఎం విజయ్, సంగీత భౌతికంగా కోర్టుకు హాజరు కావడంలో ఉన్న భద్రతాపరమైన ఇబ్బందులను వారి తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.


