సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే, బుధవారం సాయంత్రం జరిగిన విజయ డెయిరీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.


