న్యూఢిల్లీ: చాట్‌జీపీటీ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఈమెయిల్స్ రాయడం వంటి పనులకే పరిమితం కాలేదు. తప్పిపోయిన ఓ వృద్ధుడిని అతడి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంలోనూ ఉపయోగపడింది. పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ అనే వృద్ధుడు అమృత్‌సర్ తీర్థయాత్ర సందర్భంగా తన బృందం నుంచి తప్పిపోయి పొరపాటున బిహార్ వెళ్లే రైలు ఎక్కారు. చివరకు గయ చేరుకున్న ఆయనకు ఓ స్థానిక వ్యక్తి చాట్‌జీపీటీ, ఇంటర్నెట్ సాయంతో స్వగ్రామాన్ని గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు సహకరించారు.
తీర్థయాత్రలో బృందం నుంచి విడిపోయిన వృద్ధుడు
లుధియానాలోని ఫతేగఢ్ గుజరాన్ గ్రామానికి చెందిన చమన్ లాల్ సెప్టెంబర్ 11న పంజాబ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం కింద అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయన తన బృందంలోని ఇతర సభ్యుల నుంచి విడిపోయారు. అనంతరం అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయన పొరపాటున బిహార్ వెళ్లే రైలు ఎక్కారు. చివరకు గయ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చమన్ లాల్‌కు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీంతో తన ఇంటి పూర్తి చిరునామాను చెప్పలేకపోయారు.
స్థానికుడి కంటపడిన చమన్ లాల్
గయ రైల్వే స్టేషన్ సమీపంలో నీరజ్ అనే వ్యక్తి చమన్ లాల్‌ను గుర్తించారు. ఆయన ఆందోళనగా, ఆకలితో కనిపించడంతో నీరజ్ తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. వృద్ధుడికి తన గ్రామం పేరు ‘ఫతేగఢ్ గుజరాన్’ మాత్రమే గుర్తుంది. దీంతో నీరజ్ ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. సుమారు నాలుగు రోజుల పాటు చమన్ లాల్‌ను తన వద్దే ఉంచుకున్నారు.
చాట్‌జీపీటీతో గ్రామం కోసం వెతుకులాట
చమన్ లాల్ పంజాబీ భాషలో చెప్పిన పేర్లు, గ్రామం పేరును ఆధారంగా చేసుకుని నీరజ్ ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీని కూడా ఉపయోగించారు. గ్రామం పేరుకు సంబంధించిన వివిధ పదాల కలయికలతో చాట్‌జీపీటీ, ఇంటర్నెట్‌లో దాదాపు మూడు రోజుల పాటు సమాచారం వెతికారు.
లుధియానాలో గ్రామం ఆచూకీ లభ్యం
చివరకు లుధియానా జిల్లాలోని మచ్చీవాడా సాహిబ్ సమీపంలో ఫతేగఢ్ గుజరాన్ అనే గ్రామం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత నీరజ్.. చమన్ లాల్‌ను వెంట తీసుకుని గయాజీ నుంచి పంజాబ్ వరకు ప్రయాణించారు. లుధియానా చేరుకున్న అనంతరం మచ్చీవాడా ప్రాంతంలో స్థానికులను అడుగుతూ, చమన్ లాల్ ఫొటోను చూపిస్తూ గ్రామం గురించి సమాచారం సేకరించారు. ఓ స్థానిక వ్యక్తి చమన్ లాల్‌ను గుర్తించారు. ఆయన కోసం గాలిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చమన్ లాల్ ఫొటోను గతంలో చూసినట్లు తెలిపారు. అనంతరం కృష్ణ లాల్ అనే వ్యక్తి చమన్ లాల్ కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఈ విధంగా అమృత్‌సర్‌లో తప్పిపోయిన చమన్ లాల్ కొన్ని రోజుల తర్వాత సురక్షితంగా తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వృద్ధుడి ఆచూకీ గుర్తించడంలో స్థానికుల ప్రయత్నాలతో పాటు చాట్‌జీపీటీ, ఇంటర్నెట్ కూడా సహాయకారిగా నిలిచాయి.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ, జెమినీలను వణికిస్తున్న ‘జేవ్ ఏఐ’!


