PC: Instagram
టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. క్రికెట్ కామెంట్రీ, విశ్లేషణలకు సంబంధించిన వీడియోలతో పాటు.. భార్య గీతా బస్రాతో కలిసి చేసిన రీల్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఆ కోరిక లేదులెండి!
ఈ నేపథ్యంలో తాజాగా భజ్జీ ఓ ఫన్నీ రీల్‌తో ముందుకు వచ్చాడు. ఇందులో గీతా బస్రా.. ‘చిన్నప్పటి నుంచి నా భర్తకు పాద సేవ చేయాలనే కోరిక ఉండేది’ అని అనడంతో.. ‘మరి ఇంకెందుకు ఆలస్యం’ అని భజ్జీ అంటాడు. అయితే, గీతా మాత్రం.. ‘ఇప్పుడు నేను బాల్యంలో లేను.. ఆ కోరికా కూడా లేదు’ అంటూ షాక్ ఇస్తుంది. ఈ కపుల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
రూ. 7 కోట్ల బంగ్లా
ఇదిలా ఉంటే.. భజ్జీ- గీతా తమ ఇంట్లోనే ఈ రీల్ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన హర్భజన్ సింగ్‌కు జలంధర్‌లో బంగ్లా ఉంది. ప్రస్తుతం దీనిని విలువ సుమారు రూ. 7 కోట్లు అని సమాచారం.

దిగ్గజ స్పిన్నర్
కాగా భజ్జీ 1998 నుంచి 2006 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా 103 టెస్టులు, 236 వన్డేలు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20లలో 25 వికెట్లు పడగొట్టాడు.
అంతేకాదు.. టెస్టుల్లో 2225, వన్డేల్లో 1237, టీ20లలో 108 పరుగులు కూడా సాధించాడు భజ్జీ. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌కు సేవలు అందిస్తూ తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన భజ్జీని పంజాబ్ ప్రభుత్వం 2001లో ఘనంగా సత్కరించింది.

రూ. ఐదు లక్షలు, 500 గజాల భూమి, డీఎస్పీగా ఉద్యోగం
చండీగఢ్ సభలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.. హర్భజన్ సింగ్‌కు ఐదు లక్షల రూపాయల క్యాష్ రివార్డుతో పాటు.. జలంధర్‌లో 500 చదరపు గజాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటిండెంట్‌గా ప్రమోషన్ ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్‌లో కలల సౌధం
సతీమణి, నటి గీతా బస్రాతో కలిసి ఈ ప్లాట్‌లో భజ్జీ 2010లో తమ కలల సౌధాన్ని నిర్మించాడు. తెలుపు రంగులో అద్దాలతో మెరిసిపోయే ఈ బంగ్లాలో ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉండే కిటికీలు ప్రత్యేక ఆకర్షణ.

ఇంటి వెలుపల విశాలమైన స్థలం ఉండటంతో కుటుంబ సభ్యులంతా పచ్చదనంతో నిండిన ఈ తోటలో హాయిగా సేదతీరుతారు. భజ్జీ నివాసంలో హోమ్ థియేటర్ కూడా ఉంది.
అదే విధంగా.. భజ్జీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలు తెలిపేలా ప్రత్యేకంగా ఓ కాబినెట్ లివింగ్‌రూమ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో ట్రోఫీలు, అవార్డులు, ఐకానిక్ మ్యాచ్‌లు, వివిధ సందర్భాల్లో భజ్జీ దిగిన ఫొటోలు ఉంటాయి.

గీతాతో ప్రేమ, పెళ్లి
బాలీవుడ్ నటి గీతా బస్రాను ప్రేమించిన భజ్జీ.. 2015లో అక్టోబరు 29న ఆమెను వివాహమాడాడు. జలంధర్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు 2016లో కుమార్తె హినాయ హీర్ ప్లాహా, 2021లో కుమారుడు జొవాన్ వీర్ సింగ్ ప్లాహా జన్మించారు.
ఎంపీగా ప్రయాణం
రాజకీయాల్లో ప్రవేశించిన హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభలో ఎంపీగా అడుగుపెట్టాడు. అయితే, ఇటీవల పార్టీ మారి అధికార బీజేపీలో చేరిపోయాడు.


