PC: Instagram
భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది మార్చిలో ఫొటోలు పంచుకున్నాడు పృథ్వీ షా.
మా దారులు వేరయ్యాయి
ఈ నేపథ్యంలో ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో ఆకృతి అగర్వాల్ ఊహించని షాకిచ్చింది. తమ వివాహం రద్దైపోయిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘‘మా దారులు వేరయ్యాయి. మా లక్ష్యాలు వేరు. పరిస్థితులు వేరు.అందుకే నేను, నా కాబోయే భర్త కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను.
మా భవిష్యత్తు గురించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాము. మేము ఒకరి పట్ల ఒకరం ఎంతో ప్రేమను కలిగి ఉన్నాము. ఒకరి గురించి మరొకరం ఎంతగానో ఆలోచించేవాళ్లము. అయితే, మా దారులు వేరని.. కాబట్టి కలిసి జీవించడం కుదరని తెలిసివచ్చింది.

దయచేసి అసత్యాలు ప్రచారం చేయకండి
మాకున్న బాధ్యతలు, ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగా ఇద్దరం కలిసే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాము. భవిష్యత్తు ఉత్తమంగా, శాంతితో కూడి ఉండాలని.. ఇద్దరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇలాంటి కష్టమైన తరుణంలో ప్రతి ఒక్కరు మా గోప్యతను గౌరవించి.. మేము విడిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ చిలువలు పలువలు చేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్లు రాయకండి. ధన్యవాదాలు’’ అని ఆకృతి పేర్కొంది. అయితే, పృథ్వీ షా మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎలాంటి పోస్టు పెట్టలేదు.
ఎవరీ ఆకృతి?
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఆకృతి అగర్వాల్ స్వస్థలం. నటిగా ఎదుగుతున్న 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా!. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చిన ఆమె మోడలింగ్ చేసింది. త్రిముఖ అనే సినిమాలో తొలిసారి నటించింది.

గతేడాది ఓ రొమాంటిక్ రీల్ చేస్తూ పృథ్వీ షాతో తన బంధం గురించి సంకేతాలు ఇచ్చింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్‌ల పెళ్లికి పృథ్వీ షాతో జంటగా హాజరై తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతం చేసింది. ఆ తర్వాత వారం రోజుల్లోపే ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడిలా విడిపోతున్నామంటూ ఆకృతి షాకిచ్చింది.
ఎత్తుపళ్లాల కెరీర్
క్రికెటర్‌గా చిన్న వయసులోనే సత్తా చాటిన పృథ్వీ షా.. సారథిగా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించాడు. తద్వారా టీమిండియాలోకి దూసుకువచ్చి ఓపెనర్‌గా సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ ఈ ముంబైకర్.. టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు.
క్రమశిక్షణారాహిత్యం కారణంగా అతడి కెరీర్ దెబ్బతింది. ఈ క్రమంలో దేశీక్రికెట్‌లో సత్తా చాటి కెరీర్ మెరుగుపరచుకునే క్రమంలో తాజాగా వ్యక్తిగత జీవితంలో ఇలా ఎదురుదెబ్బ తగిలింది.
చదవండి: అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..


