పిల్లాడి చేష్టలు!.. పంత్‌పై వేటు.. తొలిసారి స్పందించిన యజమాని | Sanjiv Goenka 1st Public Comment On Rishabh Pant After LSG Sacking | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లాడి చేష్టలు! పంత్‌పై వేటు.. తొలిసారి స్పందించిన సంజీవ్‌ గోయెంకా

Sep 13 2026 4:12 PM | Updated on Sep 13 2026 4:36 PM

Sanjiv Goenka 1st Public Comment On Rishabh Pant After LSG Sacking

ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అతడు పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఐపీఎల్‌లో 13 ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ 312 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో లక్నో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. అదే విధంగా.. గతేడాది కూడా పంత్‌ విఫలమైన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2025లో పంత్‌ పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులకే పరిమితం కాగా.. లక్నో పద్నాలుగింట ఆరు మ్యాచ్‌లే గెలిచి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇలా రెండు సీజన్లలో దారుణ ప్రదర్శన కనబరిచిన పంత్‌పై లక్నో యాజమాన్యం వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించింది.

అంతేకాదు.. 2025 వేలంలో రికార్డు స్థాయిలో లీగ్‌లోనే అత్యధిక ధరకు రూ. 27 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో.. 2027 వేలానికి ముందే అతడిని రూ. 15 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో.. పంత్‌ను పదిహేనేళ్ల పాటు తమతో కొనసాగిస్తామన్న లక్నో జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా కేవలం రెండు సీజన్లకే అతడిని వదిలించుకోవడం చర్చనీయాంశమైంది.

అంతేకాదు జట్టు ఓడిన సందర్భాల్లో మైదానంలోనే పంత్‌కు గోయెంకా క్లాస్‌ పీకడం చూసి.. 2024లో కేఎల్‌ రాహుల్‌ మాదిరే ఈసారి పంత్‌ను బలిచేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజీవ్‌ గోయెంకా తాజాగా మౌనం వీడాడు.

శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నాకు పంత్‌ అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అతడిలో కుర్రతనం ఇంకా పోలేదు. పంత్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం. అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. ప్రాంక్‌ చేస్తుంటాడు. చిన్న పిల్లల మాదిరే అతడి చేష్టలు ఉంటాయి. అతడంటే నాకు అభిమానం’’ అని సంజీవ్‌ గోయెంకా పేర్కొన్నాడు.

ఈ క్రమంలో పంత్‌తో ట్రేడింగ్‌ గురించిన సంభాషణే ఆఖరిదా? అని హోస్ట్‌ ప్రశ్నించగా.. ‘‘కేవలం ట్రేడ్‌ గురించి మాత్రమే మేము మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కూడా మా మధ్య మాటలు కొనసాగాయి. అతడికి గుడ్‌ లక్‌. త్వరలోనే డిన్నర్‌కి కలవాలనే ప్రణాళిక ఉంది’’ అని సంజీవ్‌ గోయెంకా చెప్పుకొచ్చాడు. 

తద్వారా వృత్తి, వ్యాపారపరంగానే పంత్‌ విషయంలో తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని.. వ్యక్తిగతంగా తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే గోయెంకా సంకేతాలు ఇచ్చాడు. కాగా పంత్‌ను రూ. 15 కోట్లకు ఢిల్లీకి ట్రేడ్‌ చేసిన లక్నో.. అక్కడి నుంచి కుల్దీప్‌ యాదవ్‌ను రూ. 13.5 కోట్లకు తెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement