టీమిండియా (PC: BCCI X)
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ మాజీ క్రికెటర్‌కు మంచి మార్కులే పడుతున్నా.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్ 1-0తో సిరీస్ గెలిచినా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2027 చేరాలంటే.. న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంది.
రేసులో ఆ పేరు కూడా
కివీస్ పర్యటనలో గనుక టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతే గంభీర్‌పై విమర్శలు తప్పవు. ఇక గంభీర్ గనుక మరోసారి విఫలమైతే అతడి స్థానంలో హెడ్‌కోచ్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నాడు. గతంలో ఆశిష్ నెహ్రా పేరు సైతం ప్రముఖంగా వినిపించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆశిష్ నెహ్రా తాజాగా ఈ విషయంపై స్పందించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రాకు టీమిండియా హెడ్‌కోచ్ కావాలనే ఆశయం ఉందా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..
అంతపెద్ద మాటలు వద్దు
‘‘నేనసలు ఆశయం అనే పదాన్ని ఉపయోగించాలనుకోవడం లేదు. నేనెప్పుడూ ముందుగా ఇలాంటి ప్రణాళికలు రచించుకోను. ఏదేమైనా టీమిండియా హెడ్‌కోచ్ అవడం గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు నేనేమీ ప్లాన్ చేసుకోలేదు. భవిష్యత్తులో పదవి వరిస్తే మాత్రం కాదనకపోవచ్చు.

ప్రస్తుతం నాకున్న పనితో సంతోషంగా ఉన్నాను. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా నేను విజయవంతమయ్యానని చాలా మంది అంటూ ఉంటారు. అయితే, కేవలం కోచ్ వల్ల ఏమీ కాదు. జట్టు ప్రదర్శన బాగుంటేనే విజయాలు వరిస్తాయి. ముఖ్యంగా కెప్టెన్, కోచ్ మధ్య సమన్వయం ఉంటే అంతా సజావుగా సాగిపోతుంది.
ఆమె ఒప్పుకోవాలి.. లేదంటే విడాకులే
టీమిండియా హెడ్‌కోచ్ కావాలనే కోరిక ప్రస్తుతానికి లేదు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ముందుగా హై కమిషన్.. అంటే నా భార్య (రుష్మా నెహ్రా)ను సంప్రదిస్తా. ఆమెకు చెప్పకుండా ఏమైనా చేశానంటే విడాకులు ఇచ్చేస్తుంది. ఎందుకంటే టీమిండియా షెడ్యూల్ బిజీగా ఉంటుంది.

ఏడాదిలో ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి’’ అని భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలో.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2023లో హార్దిక్ సారథ్యంలో.. 2026 సీజన్‌లో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరింది.
చదవండి: నష్రా సంధుకు ఆరు వికెట్లు.. సెమీ ఫైనల్లో పాకిస్తాన్


