టీమిండియాతో టీ20.. జట్టును ప్రకటించిన జపాన్‌ | Japan Announced 15 Member Squad For Historic First Ever T20I Vs Team India, Check Out Names Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాతో టీ20.. జట్టును ప్రకటించిన జపాన్‌

Sep 8 2026 10:04 AM | Updated on Sep 8 2026 10:49 AM

Japan Announced Squad For Historic First Ever T20I Vs Team India

(PC: JCA Japan Cricket Association X)

టీమిండియాతో చారిత్రక మ్యాచ్‌కు జపాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేసీఏ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కెండెల్‌ కడోవాకీ ఫ్లెమింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. భారత్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును సెలక్ట్‌ చేసినట్లు జేసీఏ వెల్లడించింది.

‘స్పోర్ట్‌ 75’ పేరుతో
కాగా భారత్‌- జపాన్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారి ఇరుదేశాల పురుషుల క్రికెట్‌ జట్ల మధ్య ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాన మంత్రి సానే టకై చీ మధ్య ఇటీవలే ఒక సమావేశం జరిగింది. 

ఈ క్రమంలో ‘స్పోర్ట్‌ 75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారత్‌- జపాన్‌ మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ టీ20 మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు.

జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానంలో ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 22న ఏకైక టీ20 మ్యాచ్‌ జరుగనుంది. టీమిండియా- భారత్‌ మధ్య జరిగే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే.. తమ టీ20 చరిత్రలో టీమిండియా ఇప్పటి వరకు 19 జట్లతో తలపడగా.. జపాన్‌ 20వ జట్టు కానుంది.

టీమిండియాతో ఏకైక టీ20 మ్యాచ్‌కు జపాన్‌ జట్టు ఇదే
కెండెల్‌ కడోవాకీ ఫ్లెమింగ్‌ (కెప్టెన్‌), చార్లీ హరా హింజే, బెంజమిన్‌ ఇటో-డేవిస్‌, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్‌, అలెక్స్‌ శిరాయి-పాట్‌మోర్‌, షోమా సుగయా-స్లేటర్‌, డెక్లాన్‌ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్‌ యమామొటో, అలెస్టెర్‌ కడోవాకీ-ఫ్లెమింగ్‌, జేక్‌ కుసుడ-నైర్‌, సుయోషి తకడా.

కీలక ఆటగాళ్లు
కాగా కెప్టెన్‌, 30 ఏళ్ల కెండెల్‌ టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. గతేడాది నుంచి ఇప్పటిదాకా జపాన్‌ తరఫున 451 పరుగులు చేసిన అతడు.. టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఇబ్రహీం తకహషి మిడిలార్డర్‌ బ్యాటర్‌,. 2025 నుంచి ఇప్పటి వరకు 248 పరుగులు చేయడంతో పాటు.. 20 వికెట్లు కూల్చాడు. 

మరోవైపు.. చార్లీ హరా హింజే లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది కాలంలో అతడు 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక పేస్‌ విభాగంలో రియో సుకురనో-థామస్‌, డెక్లాన్‌ సుజుకి కీలకం. 

చదవండి: నష్రా సంధుకు ఆరు వికెట్లు... సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement