Photo Credit: Twitter
టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టుకు పసికూన నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. విండ్‌హోక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. టీ20ల్లో సఫారీలను చిత్తు చేయడం నమీబియాకు ఇది రెండోసారి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ట్రై సిరీస్‌కు సౌతాఫ్రికా తమ బి జట్టును ఆడేందుకు పంపించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు జాన్ ఫ్రైలింక్ (38 బంతుల్లో 60), లోరెన్ స్టీన్‌కాంప్ (29 బంతుల్లో 41) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ (19), అలెక్సాండర్ (13 నాటౌట్) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రినెలన్ సుబ్రయెన్ 3 వికెట్లు తీయగా, డాన్ జాన్సెన్, జోర్న్ ఫోర్టున్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది.
డెవాల్డ్ బ్రెవిస్ (50 బంతుల్లో 75) రాణించినప్పటికీ మిగతావాళ్ల నుంచి సహకారం కరువైంది. చివర్లో డాన్ జాసన్ (17 బంతుల్లో 25 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. సరిగ్గా పది నెలల క్రితం ఇదే వేదికపై సౌతాఫ్రికాను నమీబియా తొలిసారి టీ20ల్లో మట్టికరిపించడం విశేషం.
Read: నైట్‌క్లబ్ ఉదంతం.. స్టోక్స్‌ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్?


