PC: X
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో అభిమానుల అంచనాల నడుమ బరిలోకి దిగిన అతడు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజంపై విమర్శల వర్షం కురుస్తోంది.
వార్మప్ మ్యాచ్.. గాయపడ్డ బాబర్
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ముందుగా ప్రొఫెషనల్ కౌంటీ క్లబ్ సెలెక్ట్ ఎలెవన్‌తో పాక్ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడి గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం వేలికి గాయమైంది.
లార్డ్స్ టెస్టుతో రీఎంట్రీ
ఫలితంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో గురువారం లార్డ్స్‌లో మొదలైన రెండో టెస్టుతో అతడు పునరాగమనం చేశాడు. టాస్ గెలిచిన బాబర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటలో భాగంగా 290 పరుగులకే ఆలౌట్ అయింది. జోర్డాన్ కాక్స్ (55), జేమీ స్మిత్ (61) అర్ధ శతకాలు బాదగా.. గస్ అట్కిన్సన్ 45 పరుగులతో రాణించాడు.
పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అలీకి మూడు వికెట్లు దక్కాయి. ఖుర్రం షెజాద్, అలీ ఉస్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షాన్ మసూద్ ఒక్క పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
సింగిల్ డిజిట్ స్కోరు
వన్‌డౌన్‌లో వచ్చిన అబ్దుల్లా షఫీక్ (5)ను జోష్ టంగ్ వెనక్కి పంపగా.. నాలుగో స్థానంలో బాబర్ వచ్చాడు. మొత్తంగా పది బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఎనిమిది పరుగులు చేసి టంగ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బాబర్ ఆజం మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఇందులో బాబర్‌ను ఆహ్వానిస్తూ పలువురు అతిథులు అతడిని చీర్ చేశారు. అయితే, కాసేటికే అతడు పెవిలియన్‌కు చేరాడు.
నడిచినంత సేపు పట్టలేదు
ఈ నేపథ్యంలో.. ‘అతిథులు కుర్చీల్లో సెటిల్ అయ్యేలోపే బాబర్ వెనక్కి వచ్చేశాడు. మనోడితో అట్లా ఉంటది మరి!.. నడిచినంత సేపు పట్టలేదు వెనక్కి రావడానికి’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇక బాబర్ ఇటీవలే టెస్టు కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సారథిగా రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అతడు పూర్తిగా నిరాశపరిచాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య రెండో రోజు ఆటకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. వాన పడే సమయానికి పాకిస్తాన్ 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఓపెనర్ అజాన్ అవైస్ 43, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఒక పరుగుతో ఉన్నారు.
చదవండి: IND vs NZ: టీమిండియా మాస్టర్ ప్లాన్!
Babar Azam walks out to bat at Lord’s 🇵🇰 pic.twitter.com/zinQC2atc7
— Lord's Cricket Ground (@HomeOfCricket) August 28, 2026


