PC: X
టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్‌ల వారసులు భారత అండర్-19 జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యారు. స్వదేశంలో ఆస్ట్రేలియా యువ జట్టుతో ఆడే వన్డే సిరీస్‌కు ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్, సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఎంపికయ్యారు.
వీరిలో అన్వయ్ ఇప్పటికే భారత్ అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేయగా.. ఆర్యవీర్ తొలిసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఆసీస్‌తో యూత్ వన్డేలతో పాటు రెండు మల్డీ డే మ్యాచ్‌లు కూడా భారత్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను గురువారమే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన భారత క్రికెటర్ల వారసులు ఎక్కడా పెద్దగా రాణించిన దాఖలాలు లేవన్నాడు. ఇంటిపేరుతో వచ్చే ఒత్తిడే ఇందుకు ఓ కారణమై ఉండవచ్చని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ..
వాళ్లెవరూ సక్సెస్ కాలేదు!
‘‘భారత అండర్-19 జట్టులో ఇప్పుడు రెండు ప్రఖ్యాత ఇంటిపేర్లు కనిపిస్తున్నాయి. వారిపై ఆ ఇంటిపేరు వల్ల వచ్చే భారం పడకూడదని ఆశిస్తున్నా. గతంలో చాలా మంది టీమిండియా క్రికెటర్ల వారసులు.. తదుపరి దశకు చేరుకోలేకపోయారు.
స్వతహాగా వారు మంచి ఆటగాళ్లే అయినప్పటికీ తండ్రుల స్థాయిలో పేరు తెచ్చుకోలేక సతమతమయ్యారు. రోహన్ గావస్కర్ (దిగ్గజ సునిల్ గావస్కర్ కుమారుడు), అర్జున్ టెండుల్కర్ (లెజెండరీ సచిన్ టెండుల్కర్ కుమారుడు) ఇందుకు ఉదాహరణ. దిగ్గజ ఆటగాళ్ల కుమారులనే ట్యాగ్, ఇంటిపేరే వాళ్లపై బహుశా ఒత్తిడిని పెంచి ఉండవచ్చు’’ అని హనుమ విహారి పేర్కొన్నాడు.
ఆర్యవీర్ అటాకింగ్ ప్లేయర్
అదే విధంగా.. ‘‘ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 స్థాయిలో బాగానే ఆడుతున్నాడు. తండ్రి మాదిరే అతడూ విధ్వంసకర బ్యాటర్. ఇక ముందు కూడా అలాగే అటాకింగ్‌గా ఆడాలని కోరుకుంటున్నా. ఇక ద్రవిడ్ కుమారుడు అన్వయ్ కూడా చాలా చాలా మంచి క్రికెటర్.
ఇప్పటికే అండర్-19 జట్టు తరఫున ఆడి మంచి స్కోర్లు సాధించాడు’’ అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో అన్వయ్ 101 పరుగులు సాధించాడు. కాగా భారత్- ఆసీస్ యువ జట్ల మధ్య సెప్టెంబరు 18- అక్టోబరు 8 వరకు ద్వైపాక్షిక సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.


