వైభవ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి..! | Vaibhav Sooryavanshi Test Debut Vouched By Rahul Dravid | Sakshi
Sakshi News home page

వైభవ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి..!

Aug 22 2026 12:06 PM | Updated on Aug 22 2026 12:09 PM

Vaibhav Sooryavanshi Test Debut Vouched By Rahul Dravid

source: BCCI X

భారత బ్యాటింగ్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి టెస్టు క్రికెట్‌లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వైభవ్‌ను రెడ్‌బాల్‌ క్రికెట్‌లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ఐర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ద్రవిడ్‌.. వైభవ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్‌బాల్‌ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో రెడ్‌బాల్‌ మ్యాచ్‌లు కూడా ఆడేలా చూడాలని అన్నారు.

దులీప్‌ ట్రోఫీ కీలకం
2026 దులీప్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌కు వైభవ్‌ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో, ఈ టోర్నీ అతడి రెడ్‌బాల్‌ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందిని.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు.

అయితే వైభవ్‌పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, ఇక ముందు ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ఇవ్వాలని సూచించారు.

రెడ్‌బాల్‌లో ఇంకా మెరుగవ్వాలి..!
వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన వైభవ్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అతడు 17.25 సగటుతో 207 పరుగులు మాత్రమే చేశాడు.

అందుకే దులీప్‌ ట్రోఫీ అతడికి ముఖ్యమైన పరీక్ష కానుంది. ఇందులో రాణిస్తే ఆస్ట్రేలియా-ఏతో జరిగే అనధికారిక టెస్టులకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.

సెహ్వాగ్‌లా X-ఫ్యాక్టర్‌ అవుతాడా..?
వైభవ్‌ సాంకేతికంగా ఇంకా సంపూర్ణ బ్యాటర్‌గా ఎదగాల్సి ఉన్నప్పటికీ, అతడి దూకుడు టెస్టు జట్టుకు ప్రత్యేకమైన X-ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

గతంలో భారత టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్‌ ఓపెనర్‌గా దూకుడైన పాత్ర పోషించాడు. వేగంగా పరుగులు చేస్తూ ప్రత్యర్థి బౌలింగ్‌ దాడిపై ఒత్తిడి పెంచేవాడు. అదే తరహాలో వైభవ్‌ కూడా భవిష్యత్తులో టెస్టుల్లో దూకుడైన ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ప్రస్తుతానికి అతడికి టెస్టు జట్టులో స్థానం కంటే రెడ్‌బాల్‌ క్రికెట్‌లో ఎక్కువ అనుభవం, ఓర్పు, సాంకేతిక పరిణతి సాధించడం అవసరం. ద్రవిడ్‌ చెప్పినట్లుగా, వైభవ్‌ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement