ముంబై: మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహీన్’ పథకంలో భారీ ఎత్తున నిధులు పక్కదారి పట్టినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) గణాంకాల ద్వారా వెల్లడైంది. అనర్హులైన లబ్ధిదారులకు దాదాపు రూ.9,605 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం అందించే ఈ పథకాన్ని జూలై 2024లో ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో ఈ పథకం కీలక పాత్ర పోషించినప్పటికీ, ఖజానాపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నదన్న విమర్శలు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో లబ్ధిదారుల జాబితాను పలుమార్లు సరిచేసినప్పటికీ అనర్హులను పూర్తిగా తొలగించలేకపోయారు. జూన్ 2026 నాటికి 92 లక్షల మంది అనర్హుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ అయినట్లు ‘ఆర్‌టీఐ’ నివేదిక పేర్కొంది.
అనర్హుల తొలగింపునకు సంబంధించి..
ఈ-కేవైసీ పూర్తి చేయనందుకు 62 లక్షల మందిని తొలగించారు. వార్షిక ఆదాయ పరిమితి రూ. 2.5 లక్షలు దాటిన 16 లక్షల మంది పేర్లను రద్దు చేశారు. సంజయ్ గాంధీ నిరాధార్ అనుదాన్ యోజన లబ్ధిదారులు 3.6 లక్షల మంది, ఒకే కుటుంబం నుంచి రెండో దరఖాస్తు చేసుకున్న 2.5 లక్షల మంది, 65 ఏళ్ల వయోపరిమితి దాటిన 1.8 లక్షల మందిని తప్పించారు.
4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా స్థాయి పరిశీలనలో మరో 1.7 లక్షల మంది అనర్హులుగా తేలారు. గత 24 నెలల్లో ఈ పథకం కింద ప్రభుత్వం రూ.76,261 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం అర్హుల సంఖ్య 1.65 కోట్లుగా ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందిన సాధారణ పౌరుల నుంచి కాకుండా, కేవలం 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నుంచి మాత్రమే ఆ నిధులను రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: అయోధ్యలో అరుదైన సంప్రదాయం.. రాష్ట్రపతి, ప్రధానికి శాంతా దేవి రాఖీలు!


