source: X
సౌతాఫ్రికా యువ సంచలనం లుహాన్-డ్రే ప్రిటోరియస్ పురుషుల టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 79 బంతుల్లోనే అజేయ 188 పరుగులు చేసి, టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ అవతరించాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్ 2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పుణే వారియర్స్ ఇండియాపై అజేయంగా 175 పరుగులు చేశాడు.
20 ఏళ్ల ప్రిటోరియస్ CSA టీ20 ఛాలెంజ్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ టోర్నీలో టైటాన్స్‌కు ఆడుతున్న అతడు.. నిన్న నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.
24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ప్రిటోరియస్.. కేవలం 40 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత వేగం పెంచి 58 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. చివరికి 79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 188 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.97గా నమోదైంది. ఈ ఇన్నింగ్స్‌లో ప్రిటోరియస్ మరో 12 పరుగులు చేసుంటే టీ20ల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మరో చరిత్ర సృష్టించేవాడు.
ప్రిటోరియస్ రికార్డు శతకంతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నైట్స్ పూర్తిగా చేతులెత్తేసింది. డొనొవన్ ఫెరియెరా, జూనియర్ డాలా తలో 3, తబ్రేజ్ షంషి 2, గాలీమ్, ఈథన్ బాష్ తలో వికెట్ తీసి నైట్స్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు (17.2 ఓవర్లలో 143 ఆలౌట్).
ఇదీ చదవండి: విండీస్‌తో మూడో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన గిల్


