ఒకే రోజు భారత్ ఖాతాలో 6 బంగారు పతకాలు
మరో 2 రజతాలు, 2 కాంస్యాలు కూడా సొంతం
కనకం అందించిన రెజ్లర్ సుజీత్
బాక్సర్లు లవ్లీనా, పర్వీన్, అంకుశ్ ‘పసిడి’ పంచ్ ∙44 ఏళ్ల తర్వాత మహిళల హాకీ జట్టుకు ‘స్వర్ణ’ శోభ
ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ ‘బంగారు’ గురి
76 పతకాలతో ఐదో స్థానానికి దూసుకుపోయిన భారత్
ఆసియా క్రీడల మొదలైన నాటి నుంచి మన అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది... ఎట్టకేలకు భారత బృందం పెద్ద సంఖ్యలో స్వర్ణాలతో సంబరపడేలా చేసింది... శుక్రవారం మన ఖాతాలో ఏకంగా 6 పసిడి పతకాలు చేరడం విశేషం. రెజ్లింగ్‌లో సుజీత్ శిఖరాన నిలవగా... బాక్సర్లు లవ్లీనా, పర్వీన్ హుడా, అంకుశ్ పంఘాల్ అంచనాలను అందుకున్నారు.
ఆర్చరీ రికర్వ్ విభాగంలోనూ మన మహిళలు సత్తా చాటి అగ్ర స్థానం సాధించగా... భారత మహిళల హాకీ టీమ్ అరుదైన స్వర్ణంతో పాటు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించి ఆనందంలో ముంచెత్తింది. పురుషుల రికర్వ్ ఆర్చరీ రెండు రజతాలు అందించగా... సెయిలింగ్, సెపక్‌తక్రాలలో రెండు కంచు పతకాలతో ఒకే రోజు 10 పతకాలు మన ఖాతాలో చేరాయి. మెరుగైన ప్రదర్శనతో టాప్–5కు చేరిన భారత్ తమ ఈవెంట్‌లకు నేడు చివరి రోజు ఎన్ని పతకాలు సాధించి ఎక్కడ నిలుస్తుందనేది ఆసక్తికరం.
నగోయా: ఆసియా క్రీడల్లో మహిళల హాకీ ఈవెంట్ తొలిసారి నిర్వహించినపుడు (1982లో) భారత జట్టు స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మన జట్టు మరో 2 రజతాలు, 4 కాంస్యాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు 44 ఏళ్ల తర్వాత మళ్లీ మనకు పసిడి చిక్కింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 1–0 గోల్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చైనాను ఓడించి స్వర్ణపతకం గెలుచుకుంది. 10వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామి రివర్స్ స్టిక్‌తో చేసిన ఏకైక ఫీల్డ్ గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది. ఆపై చివరి వరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది.
ఆరంభంలో భారత గోల్ కీపర్ సవితా పూనియా.. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్ గోల్‌కీపర్ బిచ్చూదేవి అడ్డుగోడగా నిలవడంతో చైనా ఎంత ప్రయత్నించినా స్కోరును సమం చేయలేకపోయింది. ఆట 24వ నిమిషంలో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించగా...జాంగ్ యింగ్ షాట్‌ను సవిత నిలువరించడం విశేషం. ఆ తర్వాత సవిత స్థానంలో బిచ్చూదేవి సబ్‌స్టిట్యూట్‌గా వచ్చింది. ఇక ఆఖరి ఐదు నిమిషాల్లో గోల్ కీపర్‌ను తప్పించి 11 మంది మైదానంలో అటాక్ చేసినా బిచ్చూదేవి ముందు వారి ఆటలు సాగలేదు. తాజా గెలుపుతో స్వర్ణంతో పాటు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది.

2020 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు చూరగొన్న టీమ్... ఆ తర్వాత పేలవ ఆటతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయింది. 2023 ఆసియా క్రీడల్లో చైనా చేతిలో సెమీఫైనల్లోనే మన టీమ్ ఓడింది. ఇప్పుడు మళ్లీ ఏషియాడ్‌లో పదునైన ఆటను ప్రదర్శించి ఒలింపిక్స్ బెర్త్‌ను అందుకుంది. ఈ విజయాన్ని అభినందిస్తూ భారత మహిళల జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) నజరానా ప్రకటించింది. జట్టులో ప్రతీ సభ్యురాలు ఒక్కొక్కరికి రూ. 11 లక్షలు చొప్పున, సహాయక సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ.5.5 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.


