‘ట్రిపుల్‌’ పంచ్‌... | Indian boxers win three gold medals at Asian Games 2026 | Sakshi
Sakshi News home page

‘ట్రిపుల్‌’ పంచ్‌...

Oct 3 2026 3:59 AM | Updated on Oct 3 2026 3:59 AM

Indian boxers win three gold medals at Asian Games 2026

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఏడు బంగారు పతకాలు సాధించిన భారత బాక్సర్లు ఆసియా క్రీడల్లో మాత్రం మూడు స్వర్ణాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం మూడు ఈవెంట్స్‌లో భారత బాక్సర్లు లవ్లీనా బొర్గొహైన్‌ (మహిళల 75 కేజీలు), పర్విన్‌ హుడా (మహిలల 65 కేజీలు), అంకుశ్‌ పంఘాల్‌ (పురుషుల 80 కేజీలు) ఫైనల్లో పోటీపడగా... ముగ్గురూ విజేతగా నిలిచి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో ఓడిన ప్రియ ఘంఘాస్‌ (మహిళల 60 కేజీలు), కపిల్‌ (90 కేజీలు), నరేందర్‌ (ప్లస్‌ 90 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.  

పుట్టిన రోజు కానుకగా... 
శుక్రవారం ముందుగా లవ్లీనా 5–0తో జియి బావో (చైనా)పై గెలిచింది. తన పుట్టినరోజే లవ్లీనా బంగారు పతకం నెగ్గడం విశేషం. ఆ తర్వాత పర్విన్‌ 3–2తో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత చెన్‌ నియెన్‌ చిన్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది. మహిళల బాక్సింగ్‌ను 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టగా... మేరీకోమ్‌ (2010లో కాంస్యం, 2014లో స్వర్ణం) తర్వాత ఈ గేమ్స్‌లో రెండు పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా లవ్లీనా గుర్తింపు పొందింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో లవ్లీనా రజత పతకంసాధించింది. 

ఇటీవల గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన అంకుశ్‌ పంఘాల్‌ అదే ప్రదర్శనను ఆసియా క్రీడల్లోనూ పునరావృతం చేశాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న అంకుశ్‌ ఫైనల్లో 4–0తో కిమ్‌ మిన్‌సెయోంగ్‌ (దక్షిణ కొరియా)పై గెలిచాడు. తద్వారా ఆసియా క్రీడల పురుషుల బాక్సింగ్‌ చరిత్రలో స్వర్ణం గెలిచిన ఎనిమిదో భారత బాక్సర్‌గా అంకుశ్‌ గుర్తింపు పొందాడు. గతంలో హవా సింగ్‌ (1966, 1970లో) రెండుసార్లు బంగారు పతకాలు నెగ్గగా... అమిత్‌ పంఘాల్‌ (2018లో), డింకో సింగ్‌ (1998లో), పదమ్‌ బహదూర్‌ (1962లో), వికాస్‌ కృషన్‌ యాదవ్‌ (2010లో), విజేందర్‌ సింగ్‌ (2010లో), కౌర్‌ సింగ్‌ (1982లో) ఒక్కోసారి స్వర్ణం గెలిచారు.  

ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా నీరూ ధండా 
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో షూటర్‌ నీరూ ధండా భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనుంది. తాజా ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా రెండు స్వర్ణాలు సహా మూడు పతకాలు సాధించింది. మహిళల వ్యక్తిగత ట్రాప్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి... ఆసియా క్రీడల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా నిలిచిన నీరూ... ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కైనన్‌ చెనాయ్‌తో కలిసి బంగారు పతకం గెలిచింది. 

మహిళల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో నీరూ, మనీషా కీర్, ఆషిమా బృందం రజతం గెలిచింది. తన పోటీలు ముగియడంతో స్వదేశానికి చేరుకున్న 27 ఏళ్ల నీరూ ధండా... ఆదివారం జరగనున్న ముగింపు వేడుకల కోసం తిరిగి జపాన్‌ వెళ్లనుంది. భారత మహిళల పతాకధారిగా నీరూను ఎంపిక చేసినట్లు డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌ అంజలీ భగవత్‌ ధ్రువీకరించారు. పురుషుల పతాకధారిని ఈ రోజు ఎంపిక చేయనున్నారు.  

సెపక్‌తక్రాలో భారత్‌కు కాంస్యం
ఆసియా క్రీడల సెపక్‌తక్రాలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల క్వాడ్రంట్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీఫైనల్లో శుక్రవారం భారత జట్టు 12–15, 13–15తో ఆతిథ్య జపాన్‌ చేతిలో ఓడి కాంస్యం గెలుచుకుంది. పతకం గెలిచిన భారత సెపక్‌తక్రా జట్టులో అరుణ్, బాబీ కుమార్, ఇలాంగ్‌బమ్‌ లోఖన్‌ సింగ్, మాలెంగంబా సింగ్, ఆకాశ్‌ యుమ్నాం, రాంకుమార్‌ శర్మ సభ్యులుగా ఉన్నారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత సెపక్‌తక్రా జట్టుకిది మూడో పతకం. 2018 జకార్తా గేమ్స్‌ పురుషుల టీమ్‌ రెగూ ఈవెంట్‌లో... 2023 హాంగ్జౌ గేమ్స్‌ మహిళల టీమ్‌ రెగూ ఈవెంట్‌లో భారత జట్లు కాంస్య పతకాలు గెలిచాయి.  

నాలుగో ప్రయత్నంలో నేత్రకు కాంస్యం 
పట్టువదలకుండా పోరాడిన భారత సెయిలర్‌ నేత్ర కుమనన్‌... నాలుగో ప్రయత్నంలో ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. మహిళల సెయిలింగ్‌ డింగీ విభాగంలో నేత్ర కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. రెండు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల నేత్ర 14 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సోఫీ మోంట్‌గోమేరి (థాయ్‌లాండ్‌), జానియా ఆంగ్‌ (సింగపూర్‌) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. 

2014, 2018, 2023 ఆసియా క్రీడల్లోనూ పాల్గొన్న నేత్ర... అందులో రెండుసార్లు నాలుగో స్థానానికి పరిమితమై త్రుటిలో పతకం చేజార్చుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు మెడల్‌ సాధించడం ఆనందంగా ఉందని నేత్ర వెల్లడించింది. పురుషుల విభాగంలో గత ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విష్ణు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement