భారత జట్టు (PC: BCCI X)
భారత సీనియర్ పురుషుల టీ20 క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆసియా క్రీడలు-2026తో బిజీగా ఉంది. జపాన్ వేదికగా శ్రీలంకతో గురువారం నాటి సెమీ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ సేన 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో కదంతొక్కగా... 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టాడు.
స్వేచ్ఛగా షాట్‌లు ఆడుతూ
మిగిలిన వారిలో అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (13), అక్షర్ పటేల్ (8), తిలక్ వర్మ (2), శివమ్ దూబే (3) విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఇషాన్ మాత్రం స్వేచ్ఛగా షాట్‌లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ఇషాన్ కిషన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ త్వరలోనే తిలక్ వర్మ స్థానంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితుడవుతాడని అంచనా వేశాడు.
డేంజర్‌లో తిలక్ వర్మ ప్లేస్
‘‘మన బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. ఒక రకంగా కుప్పకూలే పరిస్థితి ఎదురైంది. అయితే, ఇషాన్ కిషన్ జట్టును అద్భుత ప్రదర్శనతో ఆదుకున్నాడు. రోజురోజుకీ అతడి ప్రభ పెరిగిపోతోంది. అతడు వైస్ కెప్టెన్ కావడానికి ఎంతో కాలం పట్టదు.
నాకు తెలిసి ఆర్నెళ్లలోనే అతడు శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీ అవుతాడు. జరగబోయేది ఇదే. ఈ అబ్బాయి నిజంగా అద్భుతంగా ఆడుతున్నాడు. వరుస మ్యాచ్‌లలో మంచి స్కోర్లు సాధిస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా కొనియాడాడు.
కాగా సెమీ ఫైనల్లో శ్రీలంకపై గెలిచిన భారత్.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. కాగా ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా పాక్‌తో మ్యాచ్‌లో 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.


