పరుగంటే కేవలం ట్రాక్ మీద పతకం కోసం పెట్టే పరుగు కాదు. కూతురికి షూస్ కొనివ్వడానికి తాను పస్తున్నతండ్రిని గెలిపించడం కోసం పెట్టే పరుగు... తనకోసం ఏదీ దాచుకోని అమ్మ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం పెట్టే పరుగు... తన ఊరు తల ఎత్తుకునేలా చేసే పరుగు... దేశం తల ఎత్తి చూసేలా పెట్టే పరుగు... కోయంబత్తూరుకు చెందిన విద్యా రామరాజ్ పరుగు అలాంటిది కాబట్టి 41 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న పీటీ ఉష రికార్డునే బద్దలు కొట్టింది. పరుగు అంటే అలా ఉండాలి.
ట్రాక్‌పై పరుగెత్తే ప్రతి అడుగు వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు ఆహ్లాదాన్ని కలిగిస్తే.. మరికొన్ని కథలు అనుబంధాలను గుర్తు చేస్తాయి. బిడ్డల ఆశయాలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు, ఆ తల్లిదండ్రులు.. కన్న కలలను సాకారం చేసేందుకు బిడ్డలు పడే తపన మనకు కనిపిస్తుంది.
అలాంటి కథే భారత అథ్లెట్ విద్యా రామరాజ్‌ది. ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఈ అథ్లెట్ విజయాల వెనుక.. ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా కూతుళ్ల అభిరుచి కోసం త్యాగాలు చేసిన ఓ తండ్రి ఉన్నారు. అలా తమ ఉన్నతికి బాటలు వేసిన తండ్రి బాగోగులు చూసుకోవాలనే కూతుళ్లు ఉన్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్య, ఆమె కవల సోదరి నిత్య..
ఇద్దరూ చిన్నతనం నుంచే అథ్లెటిక్స్‌లోకి వచ్చారు. అయితే వారి క్రీడా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండేవి. విద్యా తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.
అలా తినడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో.. ఆటలపై కూతుళ్లకి ఉన్న ఆసక్తిని తల్లి గమనించి ప్రోత్సహించింది. అయితే వారు పరిగెత్తేందుకు అవసరమైన షూస్ కొనేందుకు కూడా విద్యా తండ్రి వద్ద డబ్బులు లేని పరిస్థితి. అందుకోసం విద్య తండ్రి భోజనం చేయకుండా.. ఆ డబ్బుతో ఇద్దరు కూతుళ్లకి షూస్ కొనిచ్చేవాడు.
అలా ఆర్థిక ఇబ్బందులతో మొదలైన విద్య ప్రయాణం క్రమంగా అంతర్జాతీయ స్థాయికి చేరింది. 2026 ఆసియా క్రీడల్లో ఆమె మూడు పతకాలు సాధించింది. అలాగే 400 మీటర్ల హర్డిల్స్‌లో పరుగుల రాణి పీటీ ఉష నెలకొల్పిన జాతీయ రికార్డును కూడా అధిగమించి కొత్త రికార్డు నమోదు చేసింది. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో పోటీపడిన ఉష.. ఆ రేసును 55.42 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకొల్పగా.. ఇపుడు అదే 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో పోటీపడిన విద్య.. రేసును 54.75 సెకన్లలో పూర్తి చేసి ఉష పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
ఈ విజయం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆ రోజుల్లో మా నాన్నకి పెద్దగా ఆదాయం ఉండేది కాదు. ఒక యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేసేవారు. తమకు అథ్లెటిక్స్ కోసం షూస్ కొనాల్సి వచ్చినప్పుడు.. మా నాన్న భోజనం మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన తినకపోయినా మాకు మాత్రం ఆహారం కొనిచ్చేవారు. మేం తింటేనే పరుగెత్తగలుగుతాం కదా అని భావించేవారు. ఆయన ఎప్పుడూ మా కోసం త్యాగం చేసేవారు. అందుకే ఇప్పుడు మా విజయాలను వారికి బహుమతిగా అందిస్తున్నామని విద్యా రామరాజ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.


