టీమ్ విభాగంలోభారత జట్లకు కాంస్యాలు
గత ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు స్వర్ణ పతకం సాధించగా... ఈసారి మాత్రం కాంస్యంతో సరిపెట్టుకుంది. అభయ్ సింగ్, వీర్ చోత్రాని, సెంథిల్ కుమార్, సూరజ్ చంద్‌లతో కూడిన భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో 1–2తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అభయ్ 8–11, 8–11, 8–11తో ఎన్జీ ఇయాన్ యో చేతిలలో ఓటమి చవిచూశాడు. రెండో మ్యాచ్‌లో వీర్ చోత్రాని 11–4, 11–8, 11–5తో సంజయ్ జీవాపై గెలిచాడు. మూడో మ్యాచ్‌లో సెంథిల్ 12–10, 6–11, 8–11, 9–11తో అమీషెన్‌రాజ్ చందారన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
భారత మహిళల జట్టు గత ఫలితాన్ని పునరావృతం చేసింది. అనాహత్ సింగ్, జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, షమీనా రియాజ్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 1–2తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో అనాహత్ 11–9, 11–8, 6–11, 11–13, 10–12తో చాన్ సిన్ యుక్ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో తన్వీ 4–11, 13–11, 11–9, 13–11తో లీ కా యిపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో జోష్నా 4–11, 7–11, 9–11తో హో జె లోక్ చేతిలో ఓడిపోయింది.


