IND vs PAK T20I: ఫైనల్లో భారత్‌, పాక్‌.. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Asian Games 2026 Men's Cricket India Vs Pakistan Final, Check Out Squads, Schedule, Venues And Where To Watch Live | Sakshi
Sakshi News home page

IND vs PAK T20I: ఫైనల్లో భారత్‌, పాక్‌.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే?

Oct 1 2026 1:02 PM | Updated on Oct 1 2026 1:49 PM

Asian Games 2026 Mens Cricket India Vs Pakistan Final Where To Watch

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమైంది. ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నీ ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్‌ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

వర్షం వల్ల రద్దైన మ్యాచ్‌లు
జపాన్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక నేరుగా క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లన్నీ టాస్‌ కూడా పడకుండానే రద్దైపోయాయి.

నేరుగా సెమీ ఫైనల్‌కు
ఈ క్రమంలో ర్యాంకింగ్స్‌ ఆధారంగా టీమిండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ తలపడ్డాయి. వర్షం అంతరాయం కలిగించిన కారణంగా మ్యాచ్‌ను పదమూడు ఓవర్లకు కుదించారు.

బంగ్లాను ఓడించి పాక్‌ 
నిశిన్‌ వేదికగా టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 13 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ 11.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

లంకపై గెలిచి భారత్‌
ఇక ఇదే వేదికపై గురువారం నాటి రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- శ్రీలంక తలపడ్డాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. ఇక టార్గెట్‌ ఛేదించే క్రమంలో శ్రీలంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది.

భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా శ్రేయస్‌ అయ్యర్‌ సేన 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ ఏడాది రెండోసారి భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌
తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్తాన్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచి భారత్‌.. టైటిల్‌ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి.

చిరకాల ప్రత్యర్థులు చివరగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా శ్రీలంక వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

ఆసియా క్రీడలు-2026 ఫైనల్‌ వేదిక, షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
👉గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌
👉తేది: అక్టోబరు 3 (శనివారం)
👉వేదిక: కొరొగి స్పోర్ట్స్‌ పార్కు, నిశిన్‌, జపాన్‌
👉ప్రత్యక్ష ప్రసారం: సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ), సోనీ లివ్‌ (డిజిటల్‌)
👉మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మొదలు
👉ఇదే రోజు కాంస్యం కోసం బంగ్లాదేశ్‌- శ్రీలంక మధ్య ఉదయం ఐదున్నర గంటలకు మ్యాచ్‌ ఆరంభం

జట్లు
టీమిండియా
సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్.

పాకిస్తాన్‌
సాహిబ్‌జాదా ఫర్హాన్(కెప్టెన్‌), సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), హసన్ నవాజ్, హైదర్ అలీ, అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మొకిమ్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అరాఫత్ మిన్హాస్, సాద్ మసూద్, మాజ్ సదాకత్, అలీ రెజా.

చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement