source: X
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్ మరోసారి నిరూపించాడు. 41 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రెండు దశాబ్దాల ప్రొఫెషనల్ కెరీర్ తర్వాత వీస్ తొలిసారి హ్యాట్రిక్ సాధించడం విశేషం.
వైట్ రాక్ వారియర్స్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్ వేసిన వీస్.. వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. మూడో బంతికి ప్రమాదకరంగా కనిపించిన డ్వేన్ ప్రిటోరియస్‌ను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత శివమ్ శర్మ, సుఖ్‌జిందర్ సింగ్‌ను వరుస బంతుల్లో బోల్తా కొట్టించాడు. దీంతో వీస్ తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
వీస్ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెనడా సూపర్ 60కు ముందు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోనూ రోటర్‌డామ్ డాకర్స్ తరఫున సత్తా చాటాడు. అక్కడ కేవలం 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
వీస్ 2024 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రమే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 15 వన్డేలు, 54 టీ20లు ఆడిన వీస్.. 74 వికెట్లు, 4 అర్ద సెంచరీలు సాధించాడు. వీస్‌కు ఐపీఎల్‌లోనూ ప్రవేశం ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతడు.. వివిధ ఫ్రాంచైజీల తరఫున 18 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.
వీస్‌కు అంతర్జాతీయ కెరీర్ తక్కువే అయినా, పొట్టి ఫార్మాట్‌లో మాత్రం అపార అనుభవం ఉంది. ఈ ఫార్మాట్‌లో అతడు ఏకంగా 434 మ్యాచ్‌లు ఆడి 358 వికెట్లు తీశాడు. అలాగే 12 అర్ద సెంచరీల సాయంతో 4734 పరుగులు సాధించాడు.
ఇదీ చదవండి: Asian Games Cricket: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్


