source: X
నమీబియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు కానర్ ఎస్టర్‌హుయిజెన్, టోనీ డి జోర్జి అదరగొట్టారు. ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ 20 పరుగులకు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఈ జోడీ, రెండో వికెట్‌కు 183 పరుగులు జోడించింది.
ఈ భాగస్వామ్యం నమీబియాపై వన్డేల్లో ఏ వికెట్‌కైనా నమోదైన నాలుగో అత్యధిక భాగస్వామ్యం. ఆసక్తికరంగా టోనీ డి జోర్జి ఈ జాబితాలో రెండుసార్లు ఉన్నాడు. ఇదే సిరీస్ తొలి వన్డేలో అతడు జోర్డాన్ హెర్మన్‌తో కలిసి 190 పరుగులు జోడించి మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. 2003లో ఈ జోడీ రెండో వికెట్‌కు 244 పరుగులు జోడించింది. రెండో స్థానంలో నెదర్లాండ్స్ జోడీ క్లాప్పన్‌బర్గ్-క్లాస్ జాన్ వాన్ ఉంది. వీరు ఇదే ఏడాది రెండో వికెట్‌కు 228 పరుగులు జోడించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (335-9) చేసింది. ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి 87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 79 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రస్సెల్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ గెలిచి సౌతాఫ్రికా ఆధిక్యంలో కొనసాగుతుంది.
చదవండి: సీఎస్‌కేలో వాటా కావాలని ధోని అడగలేదు..!


