Photo Credit: BCCI Twitter
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మాత్రమే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్‌లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు.
ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్‌జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్‌ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.
ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్‌కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్‌గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్‌ను ట్రోల్ చేశాడు.
దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్‌కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.
‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.
Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026


