Photo Credit: Twitter
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. 2026 సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు సంబంధించి సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ దాఖలు చేసిన తాత్కాలిక పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టేసింది.
డబ్ల్యూఎఫ్ఐ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను సాధించని అథ్లెట్‌కు కేవలం ఒకరి కోసమే నిబంధనలు సవరించి అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. నిబంధనలు పాటించిన మిగతా క్రీడాకారులకు ఇది తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని, ప్రత్యేక మినహాయింపు ఇస్తే ఇదొక పండోరా బాక్స్ గా మారుతుందని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ పేర్కొన్నారు.
వినేశ్ వాదన ఇలా..
గర్భధారణ, ప్రసవం, పోస్ట్-పార్టమ్ రికవరీ కారణంగా తాను గత కొన్ని పోటీలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వినేష్ కోర్టుకు తెలిపింది. తాను నేరుగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయాలని కోరడం లేదని, కేవలం ట్రయల్స్‌లో పోటీపడే అవకాశం మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. డబ్ల్యూఎఫ్ఎ తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల వల్ల కూడా కొన్ని టోర్నీల్లో పాల్గొనలేకపోయానని పేర్కొంది.
విచారణ 29కి వాయిదా..
డబ్ల్యూఎఫ్ఎ జారీ చేసిన సర్క్యులర్ అథ్లెట్లందరికీ సమానంగా వర్తిస్తుందని, ఒకరి కోసం నిబంధనలు మార్చలేమని చెప్పిన కోర్టు వినేష్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కానీ, ప్రసవం తర్వాత మహిళా అథ్లెట్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు స్పోర్ట్స్ పాలసీల్లో సరైన మినహాయింపులు ఉండాలా లేదా అనే ప్రధాన అంశాన్ని తేల్చేందుకు ఈ కేసు తుది విచారణను సెప్టెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.


