‘వైభ‌వ్‌.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’ | Mohammed-Shami-Says-Vaibhav-Not-Equal-To-My-Career-Even | Sakshi
Sakshi News home page

‘వైభ‌వ్‌.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’

Sep 11 2026 1:52 PM | Updated on Sep 11 2026 2:16 PM

Mohammed-Shami-Says-Vaibhav-Not-Equal-To-My-Career-Even

Photo Credit: BCCI Twitter

ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జ‌ట్టు 13 ఏళ్ల త‌ర్వాత దులీప్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో సౌత్‌జోన్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్‌జోన్ టైటిల్‌ను అందుకుంది. ఈస్ట్‌జోన్ టైటిల్ గెల‌వ‌డంలో జ‌ట్టులోని ప్ర‌తీ ఆట‌గాడిది కీల‌క‌పాత్రే అని చెప్పొచ్చు. 

ఓపెన‌ర్‌గా వైభ‌వ్ సూర్యవంశీ ధ‌నాద‌న్ ఆటతీరు, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ క్లాస్‌, కెప్టెన్‌ ఇషాన్ కిష‌న్ మాస్‌ డ‌బుల్‌సెంచ‌రీ, కుమార్ కుషాగ్ర సెంచ‌రీ.. ఇక బౌలింగ్‌లో ముకేశ్‌కుమార్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ.. ఇలా జ‌ట్టు మొత్తం స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతోనే ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీని ద‌క్కించుకుంది.మ్యాచ్ ముగిసిన అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీపై టీమిండియా సీనియ‌ర్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌శంస‌లు కురిపించాడు. క‌నీసం నా కెరీర్‌కు కూడా సాటి రాని వైభ‌వ్ ఇవాళ స్టార్ ఆట‌గాడిగా మారిపోయాడ‌ని ష‌మీ పేర్కొన్నాడు. 

ష‌మీ మాట్లాడుతూ.."నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా జ‌ట్టులో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ ఉన్నాడు. నిజం చెప్పాలంటే వైభ‌వ్ వ‌య‌సు అక్ష‌రాలా నా కెరీర్‌తో వ‌య‌సుతో స‌మానం. అత‌డిలో టీనేజ్ అమాయ‌క‌త్వం అలాగే ఉంది. అంద‌రితో స‌ర‌ద‌గా జోకులు వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాడు. 15 ఏళ్ల వ‌య‌సులో ఒక కుర్రాడు ఏం చేస్తాడో వైభ‌వ్ అదే చేస్తున్నాడు. కానీ ప‌రిణితితో కూడిన దృక్ప‌థాన్ని అల‌వ‌ర‌చుకున్నాడు. 

ఏ విష‌యాన్నైనా త్వ‌ర‌గా గ్ర‌హించ‌గ‌ల శ‌క్తి అత‌డి సొంతం. వైభ‌వ్ లాంటి యువ‌కులు ఇప్ప‌టికే చాలా ప‌రిణితి చెంది ఉంటారు. క్రికెట్ ఆడే స్థాయి, ఐపీఎల్‌, ఇత‌ర ఒత్తిడుల కార‌ణంగా  ఎంతో ప‌రిణితి వ‌స్తోంది. వైభ‌వ్ విష‌యంలో అది ఎప్పుడో రుజువ‌య్యింది. కాబ‌ట్టి అలాంటి వాళ్ల‌కు ప్రత్యేకంగా శిక్ష‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు." అని చెప్పుకొచ్చాడు.

2011లో జ‌న్మించిన వైభ‌వ్ వ‌య‌సుతోనే షమీ కెరీర్ వ‌య‌సు స‌మానం కావ‌డం విశేషం. 2011లో ష‌మీ తొలిసారి దేశ‌వాళీలో సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌ఫున అరంగేట్రం చేశాడు. ఇక 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఎంతమంది ఆటగాళ్లకు లభిస్తుంది? కానీ వైభ‌వ్ ఆ అవ‌కాశాన్ని పొంద‌డ‌మే కాదు, త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. 

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి, 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించాడు. ఇక‌ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ అత్యధిక పరుగులు (776 పరుగులు) చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. త‌న ఆట‌తో వైభ‌వ్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ను ఒంటిచేత్తో ప్లేఆఫ్స్ చేర్చ‌డం విశేషం.

ష‌మీ, వైభ‌వ్ కీల‌క‌పాత్ర‌
ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోవ‌డంలో ష‌మీ, వైభ‌వ్ సూర్య‌వంశీలు కీల‌క‌పాత్ర పోషించారు. నార్త్ ఈస్ట్‌జోన్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, సెంట్ర‌ల్ జోన్‌తో జ‌రిగిన సెమీస్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (92, 40 ప‌రుగులు) అద‌ర‌గొట్టాడు. ఇక ఫైన‌ల్లో 44 ప‌రుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 

మరోవైపు, క్వార్టర్ ఫైనల్స్‌లో షమీ పొదుపుగా బౌలింగ్ చేయగా, సెమీస్‌లో 5 వికెట్లు పడగొట్టి సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైన‌ప్‌ను దెబ్బ‌తీశాడు. ఇక ఫైనల్స్‌లో, అతను ఫ్లాట్ పిచ్‌పై రవిచంద్రన్ స్మరణ్ వంటి కీలక వికెట్‌తో సహా మరో 2 వికెట్లు పడగొట్టాడు.

Read: ఫైన‌ల్లో స‌బ‌లెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement