వైభవ్‌పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే | Vaibhav Sooryavanshis Reply To Tilak Varmas Complaint Goes Viral | Sakshi
Sakshi News home page

వైభవ్‌పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే

Sep 11 2026 10:38 AM | Updated on Sep 11 2026 11:12 AM

Vaibhav Sooryavanshis Reply To Tilak Varmas Complaint Goes Viral

దులీప్ ట్రోఫీ-2026 విజేత‌గా ఇషాన్ కిష‌న్ నేతృత్వంలోని ఈస్ట్‌జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియగా.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా ఈస్ట్‌కు 14 ఏళ్ల తర్వాత ట్రోఫీ దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్‌జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మధ్య సరదా స్లెడ్జింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అసలేమి జరిగిందంటే?
తొలి రోజు ఆట‌లో వైభ‌వ్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు తిలక్ అత‌డి వ‌ద్ద‌కు వెళ్లి.. ఏంటి వైస్ కెప్టెన్‌? అంత స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావు? అని స్లెడ్జ్ చేశాడు. అయితే అందుకు బ‌దులుగా నాలుగో రోజు ఆట‌లో తిల‌క్ బ్యాటింగ్‌కు వ‌చ్చినప్పుడు వైభ‌వ్ కూడా అత‌డిని సరదాగా ఆట‌ప‌ట్టించాడు. 

తిలక్ వద్దకు దగ్గరగా వెళ్లి మాట్లాడే క్రమంలో వైభవ్ భుజం అతడికి తగిలింది. దీంతో తిలక్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అంపైర్ వచ్చి వైభవ్‌ను మందలిస్తుండగా.. "సార్, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాతో కూడా ఇలాగే జరిగింది" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్‌జోన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 708 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిష‌న్(270) అద్భుత‌మైన డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. అనంత‌రం సౌత్‌జోన్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 336 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌కు 372 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. 

ఆ త‌ర్వాత ఈస్ట్‌జోన్ త‌మ‌ రెండో ఇన్నింగ్స్‌ను ఆఖ‌రి రోజు ఆట‌లో 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కౌనైన్‌ ఖురేషీ (190 బంతుల్లో 116 నాటౌట్‌; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా, అనుకూల్‌ రాయ్‌ (112 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుమార్‌ కుషాగ్ర (46) రాణించారు.

సౌత్‌ బౌలర్లలో నిధీశ్‌ 2 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, సిరాజ్, రషీద్, విజయ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. గురువారం 48.2 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌ మరో 176 పరుగులు జోడించింది. ఫలితం ‘డ్రా’ ఖాయం కావడంతో సౌత్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగకుండా ఇరు జట్ల కెప్టెన్లు ఆటను ముగించేందుకు అంగీకరించారు. ఇషాన్‌ కిషన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... తిలక్‌ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.
చదవండి: ENG vs PAK: సేమ్ సీన్ రీపీట్‌! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement